తుమ్మలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించాం

– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణ-దమ్మపేట
కాంగ్రెస్‌ పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు చేరిక లాంఛనమే అంటూ సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతున్న వాదనకు బలాన్ని చేకూర్చే విధంగా ఆదివారం మధిర ఎమ్మెల్యే, సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క తుమ్మలను కలిశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని తుమ్మల నాగేశ్వరరావు స్వగ్రామమైన గండుగలపల్లిలో అతని ఇంటి వద్ద భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల భట్టిని సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. అనంతరం ఇరువురు నేతలు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తుమ్మలను కాంగ్రెస్‌ పార్టీలోకి రావాల్సిందిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆహ్వానించారు. దీనిపై తుమ్మల స్పందిస్తూ తన అనుచరులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో చర్చలు జరిపిన అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని భట్టికి తెలిపారు. ప్రజల పక్షాన పోరాడుతున్న కాంగ్రెస్‌ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని భట్టి విక్రమార్క విలేకర్లకు తెలిపారు. కార్యక్రమంలో సత్తుపల్లి కాంగ్రెస్‌ నాయకులు మట్టా దయానంద్‌, డాక్టర్‌ నరసింహారావు, అశ్వరావుపేట బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు బండి పుల్లారావు పాల్గొన్నారు.