– ప్రజ్వల్ రేవణ్ణ వీడియో లీక్‌లతో హస్సన్ నియోజకవర్గ మహిళల్లో భయాందోళనలు
– ఆత్మహత్య చేసుకుంటామంటున్నారు
– ఇప్పటికే ముగ్గురు బలవన్మరణానికి యత్నించారు : రచయిత్రి, హక్కుల కార్యకర్త రూపా హసన్
బెంగళూరు : కర్నాటకలో బీజేపీ మిత్రపక్షం జేడీ(ఎస్) బహిష్కృత నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో కర్నాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).. తన దర్యాప్తును వేగవంతం చేసింది. కాగా, ప్రజ్వల్‌పై రెండోసారి లుకౌట్ నోటీసు జారీ చేసినట్టు రాష్ట్ర హౌం మంత్రి పరమేశ్వర ఇప్పటికే వెల్లడించారు. అయితే, ప్రజ్వల్ సాగించినట్టుగా చెప్తున్న లైంగిక దౌర్జన్యానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. బాధిత మహిళలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఆయనపై ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ప్రజ్వల్‌పై కర్నాటకలో లైంగికదాడి, కిడ్నాప్ కేసు నమోదైంది. అయితే, ప్రజ్వల్ విషయంలో హస్సన్ లోక్‌సభ పరిధిలో ఉన్న పలువురు బాధిత మహిళలు తీవ్ర భయాందోళనతో ఉన్నారు. దీనికి సంబంధించి 2,900 పైగా వీడియోలున్నాయని జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల ద్వారా తెలిసిందని రచయిత్రి, స్త్రీలు, పిల్లల హక్కుల కార్యకర్త రూపా హసన్ తెలిపారు. హసన్, ఆమె సహౌద్యోగులు వీడియోలలో చాలా మంది స్త్రీలు తమకు తెలిసిన వారేనని గ్రహించారు. ”మహిళల హక్కుల కార్యకర్తలుగా, మేము ప్రతిరోజూ మహిళలను కలుస్తాం. ఈ వీడియోలలో చాలా మంది తెలిసిన ముఖాలను చూడటం ఆశ్చర్యంగా ఉన్నది” అని ఆమె చెప్పారు. ఆత్మహత్య చేసుకోవటం తప్ప తమకు వేరే మార్గం లేదని పలువురు మహిళలు నాకు ఫోన్‌లో విలపించారని తెలిపింది. ”ఈ స్త్రీలలో ఎక్కువమంది వివాహితులు, పిల్లలు కలవారున్నారు. కొంతమంది మహిళలు తమ ముఖాలను వీడియోలుగా మార్ఫింగ్ చేశారని అంటున్నారు” అని ఆమె చెప్పారు. దాదాపు 300 మందికి పైగా మహిళలు వీడియోల్లో కనిపిస్తున్నారని రూపా హసన్ అంచనా వేశారు. మరిన్ని వీడియోలు బయటకు వస్తాయని ప్రజలు చెబుతున్నారనీ, మేమంతా శాశ్వత భయంతో జీవిస్తున్నామని తెలిపారు. అయితే, ఈ వీడియోలు, చిత్రాలు ఇప్పుడు హస్సన్ నియోజకవర్గంలోని ప్రజల కంప్యూటర్లు, ఫోన్లలో చక్కర్లు కొట్టం ఆందోళనకరమైన విషయమని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. వీడియోలలో కనిపించిన వారిలో ముగ్గురు మహిళలు ఆత్మహత్యకు ప్రయత్నించారనీ, అయితే ప్రాణాలతో బయటపడ్డారని రూపా హసన్ చెప్పారు.
మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు అయిన ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం అంశంపై రాజకీయ దుమారం చెలరేగుతున్నది. ప్రజ్వల్ రేవణ్ణ పార్టీ జేడీ(ఎస్).. బీజేపీకి మిత్రపక్షం. గతనెల 14న మైసూరులో జరిగిన జేడీ(ఎస్) ర్యాలీలో స్వయంగా ప్రధాని మోడీ, రేవణ్ణలు ఒకే వేదికపై కనిపించారు. అదేనెల 27న రేవణ్ణ దౌత్య పాస్‌పోర్ట్‌పై జర్మనీకి పారిపోయాడని తెలిసింది. దీంతో, ప్రతిపక్ష నాయకులు మోడీ.. ప్రజ్వల్ ప్రయాణాన్ని సులభతరం చేశారని ఆరోపించారు.ఇలాంటి రాజకీయ వివాదాల నడుమ మహిళా కార్యకర్తగా, మహిళలకు మద్దతు అందించడమే తన ప్రాధాన్యత అని రూపా హాసన్ నిర్ణయించుకున్నది. ”మేము మరేదైనా చర్చించటానికి ముందు, వారు కఠినమైన చర్యలు తీసుకోకుండా కౌన్సెలింగ్ అందించడం నాకు ముఖ్యమని నేను గ్రహించాను. చాలామంది చాలా తప్పుగా ఫీల్ అవుతున్నారు. దీన్ని ఎలాగైనా తట్టుకునేలా వారికి బలాన్ని ఇవ్వటానికి నేను ఒక మార్గాన్ని కనుగొనవలసి వచ్చింది” అని ఆమె చెప్పారు. ఆమె మాట్లాడిన మహిళలు తమ భర్తలు వీడియోల్లో ఉన్నారని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారని రూపా హసన్ చెప్పారు.