సూడో సైన్స్‌ కాదు… జనరల్‌ సైన్స్‌ కావాలి…

చంద్రయాన్‌-3 రాకెట్‌ ప్రయోగం విజయం వెనుక అనేకమంది ఇస్రో శాస్త్రవేత్తల అహర్నిషల కృషి ఉంది. అందుకే దేశమంతా వారికి అభినందనలు తెలుపుతోంది. శాస్త్ర,సాంకేతికరంగంలో మన దేశ పురోగమికి ఇదో చిహ్నం. మరిన్ని ప్రయోగాల ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయడం అవసరం. కానీ చంద్రయాన్‌ విజయవంతం కావాలని ముందుగా ఇస్రో చైర్మన్‌, ఇతర సిబ్బంది ఈ నెల 13న ఏపీలోని తిరుమలలో పూజలు చేసి మెదళ్లను విగ్రహాల ముందు తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఇది సైన్స్‌ సమాజానికి, రేపటి తరం శాస్త్రవేత్తలు, విద్యార్ధి లోకానికి ఎలాంటి సందేశం ఇస్తున్నది ఆలోచించాల్సిన అంశంగా కనిపిస్తున్నది. హైస్కూల్లో 8, 9, 10 తరగతులు చదివే విద్యార్థులకు సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణితం అంశాల బోధనలో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సైన్స్‌ ప్రదర్శనలు ఏర్పాటు చేసి భవిష్యత్‌ తరం శాస్త్రవేత్తలకు పునాది వేస్తూ ఉంటారు. ఆ తర్వాత కళాశాల ఉన్నత విద్య ద్వారా మెదడుకు మరింత పదునుపెట్టడం అందరికీ తెలిసిందే. అయితే ఈ విద్వా వైజ్ఞానిక పరిశోధనల్లో ఎక్కడా కూడా దైవ శక్తి మహిమలు, మత విశ్వాసాలు, విగ్రహారాధన వంటి అంశాలు కనపడవు. అలాంటి విద్యార్థులు పెద్దయ్యాక గొప్ప శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, డాక్టర్‌లు అయ్యివారి వృతిలో దైనందిన జీవితంలో పూజలు, విగ్రహారాధన, మత క్రతువులు చేయడంలో అర్థం లేదు. రాకెట్‌ శాటిలైట్‌ ప్రయోగం చేసే ముందు నమూనాను తిరుమల వెంకన్న, లేదా చెంగాలమ్మ విగ్రహాల పాదాలవద్ద పెట్టి వారి మేధస్సును కూడా తాకట్టు పెట్టడం చేయాలా! హాస్పిటల్‌లో వైద్యం చేసే ముందు, గర్భిణీ కాన్పు కోసం ముహూర్తం చూడటం డాక్టర్లు సైతం దేవుడా ఈ ఆపరేషన్‌ సక్సెస్‌ కావాలి అంటూ పూజలు చేయడం, హాస్పిటల్‌ అవరణలో గుడి కట్టడం అక్కడక్కడ సోషల్‌మీడియాలో గుప్పుమంటున్న వార్తలే. ఇంకా పోలీసుస్టేషన్‌ల్లో, పోలీసు వాహనాలకు పూజలు చేయడం, ప్రభుత్వ అధికార దుర్వినియోగం చేస్తూ రాష్ట్రపతి, గవర్నర్‌, సుప్రీం కోర్టు హైకోర్టు జడ్జీలు ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులు గుళ్లు గోపురాలు చుట్టూ తిరగడం సమాజానికి ఏం నేర్పుతున్నట్టు?
ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యక్రమాలు శంకుస్థాపన, ప్రారంభంలో పురోహిత వర్గాలతో పూజలు, పాస్టర్‌లతో ప్రార్థనలు చేయడం, కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్‌లకు పూజలు చేయడం ఇదంతా ఎక్కడినుంచి వస్తున్నది.ఎవరి మెదళ్లను కలుషితం చేస్తున్నారు? ఇస్రో శాస్త్రవేత్తలు గుళ్లలో పూజలు చేయడం నుంచే కదా! ఇంజినీరింగ్‌, మెడికల్‌, సివిల్స్‌ వంటివి చదివే విద్యార్థులు అధికారులు సైతం కాలికి దిష్టి పేరుతో నల్ల రంగు దారాలు కట్టుకోవడం చూస్తూ ఉంటే ఈ సమాజం ఎటువైపు పోతుందో అర్థం కావడం లేదు. సైన్స్‌ వల్ల సమాజం మూడు అడుగులు ముందుకు వేస్తూ ఉంటే మూడ విశ్వాసాల వల్ల ఆరు అడుగులు వెనక్కి వెళ్తుండటం ఎదుగు తున్న దేశానికి ఎంతమాత్రం సహేతుకం కాదు. హేతుబద్దత శాస్త్రీయ దృష్టి లోపించిందనే స్పష్టంగా కనిపిస్తున్నది. రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్‌ 51ఏ (హెచ్‌) ప్రకారం సమాజంలో మూడ విశ్వాసాలు పోగొట్టి ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం కల్పించడం అనే లక్ష్యాన్ని వదిలేసి పరిపాలనలో రాజ్య వ్యవస్థలో మతపరమైన జోక్యం తీసు కొస్తున్నది కేంద్రం. ఎన్‌సిఈఆర్‌టి పాఠ్యాంశాల నుండి మొఘల్‌ చరిత్ర, డార్విన్‌ సిద్ధాంతం, భగత్‌సింగ్‌, గాంధీ వంటి వారి చరిత్రను తొలగించారు. ఆ స్థానంలో వాస్తు, పురాణాలు, జ్యోతిష్యం గోవాల్కర్‌, గాడ్సే, సావర్కర్‌ వంటి వారి గురించి నూతన అంశాలు చొప్పిస్తున్నారు. ఇలాంటి చర్యల ద్వారా పాల కులు విద్యారంగాన్ని పూర్తిగా కాషాయకరణ చేస్తున్నారు. భవిష్యత్తులో భారతదేశం కూడా ఆఫ్ఘన్‌లో తాలిబాన్‌ మాదిరిగా మరొక మతఛాందస పాలనలోకి వెళ్ళిపోకుండా మేధావులు, లౌకిక శక్తులు గళం విప్పాలి, ఐక్యం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.