కల్తీ లేని ఆహారం కావాలి

కల్తీ లేని ఆహారం కావాలి– పార్టీలు ఆ మేరకు హామీ ఇవ్వాలి : ఎఫ్‌జీజీ యం.పద్మనాభరెడ్డి,
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజలందరికీ కల్తీ లేని ఆహారాన్ని అందిస్తామంటూ అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) అధ్యక్షులు యం.పద్మనాభరెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆహారపదార్ధాల కల్తీ పెరిగి ప్రజలు జీర్ణకోశం పాడవడం, చూపు మందగించడం, కీళ్ల నొప్పులు, క్యాన్సర్‌, గుండెనొప్పి, పక్షవాతం వంటి దీర్ఘకాలిక రోగాలకు గురవుతూ చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 1954లో ఆహార కల్తీ నిరోధక చట్టం వచ్చినా పటిష్టంగా అమలు చేయడం లేదని విమర్శించారు. మిస్‌ బ్రాండెడ్‌, సబ్‌ స్టాండర్డ్‌ నిల్వ చేయడం, అమ్మడం నేరమనీ, అదే విధంగా అంటు వ్యాధులతో బాధపడుతున్న వారిని పనిలో పెట్టుకోకూడదని తెలిపారు. కల్తీని గుర్తించడంలో ప్రజలు ఆసక్తి చూపకపోవడం, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో సమస్య తీవ్రత పెరిగిందని చెప్పారు. దేశంలోని 19 పట్టణాల్లో ఆహార కల్తీపై సర్వే చేస్తే 246 కేసులతో దేశంలోనే అత్యధిక ఆహారకల్తీ నగరంగా హైదరాబాద్‌ నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కేవలం 30 మంది ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పని చేస్తున్నారని చెప్పారు. కోట్లాది రూపాయలు ఆదాయాన్ని సంపాదించుకునే హౌటళ్లకు కొన్ని వేల రూపాయలు మాత్రమే జరిమానా విధిస్తున్నారనీ, దాన్ని పెంచాల్సిన అవసరముందన్నారు.
డాక్టర్‌ ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ గత పదేండ్లలో ఆహారకల్తీ కేసులు భారీగా పెరిగాయని తెలిపారు. ఒక మనిషి 35 -50 ఏండ్ల మధ్య బతికితేనే తర్వాత కాలం బతుకుతారని డాక్టర్లు చర్చించుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. కల్తీ ఆహారం కారణంగా రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయని తెలిపారు. డాక్టర్‌ ఎన్‌.కిషన్‌ మాట్లాడుతూ, కోవిడ్‌ తర్వాత ఆహార సంబంధిత వ్యాధులు 20 నుంచి 25 శాతం పెరిగాయన్నారు. కరోనా కాలంలో దెబ్బతిన్న వ్యాపారులు ఆ తర్వాత లాభాలే లక్ష్యంగా ఇష్టానుసారంగా కల్తీ చేస్తున్నారని తెలిపారు. ఆహార నిపుణురాలు ఆచార్య విజయఖాద్రి మాట్లాడుతూ రాష్ట్రంలో చాలినంత మంది ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు, ల్యాబరేటరీలు లేవని విమర్శించారు. కల్తీ చేసిన వారిపై పెద్దగా కేసులు, కఠినంగా శిక్షలు లేకపోవడం కూడా సమస్యను పెంచుతున్నదని వివరించారు. న్యాయవాది శ్రావ్య కట్టా మాట్లాడుతూ కల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సామాన్యులు, వినియోగదారులు తెలుసుకోలేనంతగా అమ్మకందారులు ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారని తెలిపారు. హైటెన్‌ ఇన్నోవేషన్‌ సొల్యూ,న్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధి జె.గోవర్థన్‌ రెడ్డి మాట్లాడుతూ పండ్లకు, ముఖ్యంగా మామిడి పండ్లకు ఇష్టానుసారంగా కార్బైడ్‌ వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుమతించిన ప్రమాణాల్లో సహజ, టాక్సిక్‌ లేని రిపైనర్‌ ఎన్‌ రైప్‌ను తాము ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ఫుడ్‌ కంట్రోలర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విజరు కుమార్‌ మాట్లాడుతూ ఆహారంలో కల్తీ చేస్తున్నట్టు అనుమానం ఉంటే 91001 05795కి వాట్సప్‌ మెసేజ్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆహార కల్తీ నిరోధానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.