నవతెలంగాణ-హాజీపూర్
మండలంలోని గుడిపేట్ మేజర్ గ్రామం పంచాయతీలో మీ సేవ కేంద్రం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో ఉన్న మీ సేవను గత పంచాయతీ పాలక వర్గం వద్దని చెప్పిందంటూ తీర్మానం ఇచ్చినట్లు జిల్లా ఈడీఎం చెబుతున్నారు. మూడేళ్లుగా ఆన్‌లైన్ సేవలు అందక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గుడిపేట్‌లో మీసేవ కేంద్రం లాభాలు రావడం లేదని నిర్వాహకుడు గత పంచాయతీ కార్యదర్శికి, మండల రెవెన్యూ అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు ఇచ్చి పంచనామా పత్రం తీసుకొని మండల కేంద్రానికి బదిలీ చేయించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ తతంగంలో స్వయానా ఈడీఎం కార్యాలయంలో ఒక ముఖ్య అధికారి హస్తం వున్నట్లు తెలుస్తోంది. మీ సేవ ట్రాన్స్‌ఫర్ విషయంలో గత సర్పంచ్‌ను వివరణ కోరగా మేము ఎలాంటి తీర్మానం చేయలేదని అంతా ఫోర్జరీ సంతకాలతో ఇలా అయి ఉండ వచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 10 వేల జనాభా ఉన్న గ్రామంలో మీ సేవకు ఇబ్బందులు అవుతున్నాయని గత సర్పంచ్ పదవీ కాలానికి రెండు రోజుల ముందు కలెక్టర్‌కు మీ సేవ కావాలని దరఖాస్తు ఇవ్వడం కొసమెరుపు. ఇంత జనాభా ఉన్న గ్రామంలో సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్న విషయం అధికారులకు తెలియడం లేదా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
జనాభా ఫుల్.. సేవలు నిల్..
మండలంలో హాజీపూర్, దోనబండ, ముల్కల్ల, వేంపల్లి, రాపల్లితో పాటు గతంలో గుడిపేట్‌లో మీ సేవ కేంద్రం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ గుడిపేట్ మీ సేవ మాత్రం మూడేండ్లుగా గుడిపేట్‌లో కానరావడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. మండలంలో మేజర్ పంచాయతీ అయిన గుడిపేట్‌లో 13వ బెటాలియన్‌తో పాటు మెడికల్ కాలేజీ, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులం, కేంద్రీయ విద్యాలయం, అర్బన్ రెసిడెన్షియల్‌లు ఉన్నాయి. నంనూరు, చందనాపూర్ గ్రామలతో పాటు దుబ్బపల్లి, గుడిపేట గ్రామాల్లో కలిపి సుమారు 10 వేల మంది జనాభా ఉంటారు. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలతో పాటు, విద్యార్థుల చదువులకు అవసరమైన సర్టిఫికెట్‌లు, పోటీ పరీక్షల దరఖాస్తు, జిల్లా కార్యాలయాలకు వచ్చే ప్రజలకు మీ సేవ కేంద్రం అవసరం. కానీ ఇక్కడ మీ సేవ కేంద్రం లేకపోవడంతో హాజీపూర్ మండల కేంద్రంలో ఉన్న మీ సేవకు పోవాల్సి వస్తుంది. అక్కడికి జనం ఎక్కువ పోతుండడంతో రద్దీ ఎక్కువ అవుతుంది. సేవల కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయమై ఈడీఎంను వివరణ కోరగా గుడిపేట్‌లో మీ సేవ ఉంది కాని అధి ట్రంజాక్షన్ లేదని నిర్వాహకుడు సంబధిత గ్రామ పంచాయతీ నుంచి పంచనామా పత్రం తీసుకు రావడంతో ఆ మీ సేవను మండల కేంద్రానికి ట్రాన్సఫర్ చేయడం జరిగిదని వివరణ ఇచ్చారు. ప్రజలకు మీ సేవ లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకొని పాత మీసేవను రద్దు చేసి కొత్తగా మీ సేవ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఏదేమైనా అధికారులు స్పందించి 10 వేల జనాభా వున్న గుడిపేట్‌లో మీ సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
మూడేండ్లుగా ఆన్‌లైన్ సేవలు లేవు బండారి సృజన్ కుమార్
మా గ్రామంలో గతంలో మీ సేవ ఉండేది. కానీ మూడేళ్లుగా మీ సేవ కానరావడం లేదు. ఏ దైన అవసరం పడితే దూరంలో ఉన్న మండల కేంద్రం పోవాల్సి వస్తుంది. అక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఒక పనికి పోతే పొద్దు గడుస్తుంది. అధికారులు స్పందించి మా గ్రామంలో మీ సేవ ఏర్పాటు చేయాలి.