మళ్లీ చెప్తున్నాం… అధికారంలోకొచ్చాక తొలగిస్తాం

– కేటీఆర్‌ ట్వీట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అధికారంలోకి వచ్చాక తెలంగాణకు అక్కరకురాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన బుధవారం ‘మళ్లీ చెప్తున్నాం…రాసి పెట్టుకో’ అంటూ సీఎం రేవంత్‌ నుద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానిస్తూ ట్వీట్‌ చేశారు. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తామని తెలిపారు. ‘ సోనియాగాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్‌ గాంధీ మీద ప్రేమ ఒలకబోసేది. దొడ్డి దారిన పీసీసీ ప్రెసిడెంటై ఇవాళ రాజీవ్‌ గాంధీ మీద కపట ప్రేమ ఒలకబోస్తున్నావు.. నీ అసలు రంగు అందరికీ తెలుసు..’ అని విమర్శించారు. సీఎం ఆలోచనల్లో కుసంస్కారం దాగుందనీ, ఆయన మాటలు అష్ట వికారంగా ఉన్నాయని తప్పుపట్టారు. తెలంగాణ తల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్‌ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారుకూతలు కూస్తావా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే, అది గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటదని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.