– అమల్లోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి
– మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎన్నికల కమిషన్ సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన శనివారం నుంచే జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. సాధారణ లోక్‌సభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. లోకసభ ఎన్నికల నిర్వహణపై జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డితో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున మతం, కులం, ప్రాంతంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం, తప్పుడు ప్రచారాలు చేయడంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ఫిర్యాదులను ప్రజలు 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా, సి-విజల్ యాప్ ద్వారా చేయవచ్చని అన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ హరిప్రియ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాజేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వైఎస్. గౌడ్, బీజేపీ మండల అధ్యక్షులు యాదగిరి, టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ అశోక్ కుమార్ గౌడ్, జనరల్ సెక్రెటరీ అంతగాళ్ల అశోక్, తదితరులు పాల్గొన్నారు.
ఎంసీఎంసీ మీడియా సెంటర్ ప్రారంభం
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మల్కాజిగిరి-07 పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మోనిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ), మీడియా సెంటర్‌ను సోమవారం ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎంసీఎంసీ పనితీరు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడూ మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మోనిటరింగ్ కమిటీ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి అరుంధతి, డిప్యూ టీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ నాగాంజలి, పాల్గొన్నారు.
బ్యాంకర్లు జాగ్రత్తగా వ్యవహరించాలి
లోకసభ ఎన్నికల సమయంలో బ్యాంకర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని మల్కాజిగిరి-07 పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఎన్నికల వ్యయ మానిటరింగ్ సమావేశాన్ని బ్యాంకర్లతో నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకర్లకు, బ్యాంకు ఖాతాదారులకు ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిర్దేశించారు. నగదు రవాణా సమయంలో అవసరమైన మేరకు క్యూఆర్ కోడ్‌ను తప్పని సరిగా చూపించాలన్నారు. నగదు లావాదేవీలు, రవాణా చేసేటప్పుడు తగిన ఆధారాలతో జరగాలని నిర్ధేశించారు. రూ.50వేల కంటే ఎక్కువ ఉంటే అందుకు తగిన రుజువులు, ధ్రువీకరణ పత్రం జత చేయాల్సిందిగా సూచించారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలు ఉంటే రోజువారీగా నివేదిక సంబంధిత ఎల్డీఎమ్లకు అందచేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసులు, జిల్లాలోని బ్యాంకర్లు, నోడల్ అధికారులు, ఎన్నికల అధికారులు, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.