– భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట రాజు
– సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా మేడే
నవతెలంగాణ-ఆసిఫాబాద్
భవన నిర్మాణ కార్మికులు ఐక్యంగా ఉండి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరాజు అన్నారు. జిల్లా కేంద్రంలో సీఐటీయూ అనుబంధ సంఘమైన భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బాలకిషన్ అధ్యక్షతన నిర్వహించిన మే డే వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కులాలు, మతాల పేరుతో ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. కార్మికులు సంపద సృష్టికర్తలు కావాలే కానీ, ప్రస్తుతం కార్పొరేట్ పెట్టుబడిదారులు సంపద సృష్టికర్తలుగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం వెలిగిపోతుందని ప్రగల్బాలు పలుకుతున్న కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి రూ.లక్ష 70000 కోట్లు కేటాయించాల్సి ఉండగా రూ.80 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించడమేంటని ప్రశ్నించారు. కార్మికుల రక్షణ కోసం తీసుకువచ్చిన 1998 చట్టం కూడా రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఇదే సందర్భంలో గుజరాత్లో పదికి పైగా పెట్టుబడుదారులు రూ. వేలకోట్ల మోసం చేశాయన్నారు. కార్మిక చట్టాలు అమలు కావడం లేదని 44 చట్టాలను రద్దు చేసిన నాలుగు కోడ్లుగా అమలు చేస్తే కార్మికుల కష్టాలు పోతాయని కేంద్ర ప్రభుత్వం మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. అలా చేస్తే ప్రస్తుతం కార్మికులు ప్రమాదంలో మరణిస్తే రూ. 6,30,000 వస్తున్నాయని కోడ్లు అమలు అయితే రూ.నాలుగు లక్షలు మాత్రమే వస్తాయని తెలిపారు. కార్మికుల కోసం ప్రస్తుతం రూ.12 చెల్లించాల్సి ఉందని అదే అమలు అయితే రూ.350 చెల్లించాల్సి వస్తుందన్నారు. ఈ కోడ్లతో కార్మికుల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. రాష్ట్రంలో వెల్ఫేర్ బోర్డులో రూ.4,800 కోట్లు ఉండగా రూ.3600 కోట్లు మాత్రమే పంపిణీ చేశారన్నారు. 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉండగా 14 లక్షల మందిని మాత్రమే సభ్యులుగా చేర్చారని తెలిపారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్‌కు వెల్ఫేర్ బోర్డు నుండి రూ.500 కోట్లు తీసిందని, ఇదే కాకుండా కరోనా సమయంలో బియ్యం పంపిణీ కోసం రూ.1000 కోట్లు వెల్ఫేర్ బోర్డు నుండి ఖర్చు చేసిందన్నారు. జిల్లాలో 75 వేల మందికి పైగా కార్మికులు ఉండగా కేవలం 15752 మంది మాత్రమే నమోదయ్యారన్నారు. కార్మికులు ఐక్యంగా ఉండి పోరాటం చేసినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.
జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ
మే డే వేడుకలను పురస్కరించుకొని భవన నిర్మాణ కార్మిక సంఘంతో పాటు సీఐటీయూ అనుబంధ సంఘాల ప్రతినిధులు జిల్లా కేంద్రాల్లోని గ్రామపంచాయతీ నుండి గాంధీ చౌక్, వివేకానంద చౌక్, అంబేద్కర్ చౌక్ల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మిక దినోత్సవ నినాదాలు చేస్తూ ర్యాలీ అధ్యంతం ఉత్సాహంగా సాగింది. అనంతరం కార్మిక జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, జిల్లా నాయకులు రామ్ చందర్, మండల అధ్యక్షుడు కమలాకర్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, జిల్లా నాయకుడు కృష్ణమాచారి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం దినకర్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టీకానంద్, కార్తీక్, టీఏజీఎస్ జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు కోరంగ మాలశ్రీ, కోట శ్రీనివాస్, పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా నాయకులు సమ్మయ్య, బాలేష్, శకుంతల, వనిత, కార్మికులు పాల్గొన్నారు.