ఆ మూడింటిపై దృష్టి పెట్టాలి,విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పించాలి

–  ప్రజల అవసరాలను తీర్చితేనే అభివృద్ధి: సామాజికవేత్తలు, నిపుణులు, విశ్లేషకుల సూచన
న్యూఢిల్లీ : దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదనీ, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలతో పోల్చితే ఐదో స్థానానికి చేరుకున్నదని మోడీ సర్కారు ప్రచారాలు చేసుకుంటున్నది. మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉన్నదని ఇటు బీజేపీ, దాని అనుకూల మీడియా, సోషల్‌ మీడియాలో ప్రచారాలు హోరెత్తుతున్నాయి. అయితే, ఇవేవీ దేశంలోని సామాన్య ప్రజలకు ప్రత్యక్షంగా ఊరటనందించవని నిపుణులు, విశ్లేషకులు అన్నారు. ప్రభుత్వం ద్వారా జరిగే ఏ పనైనా, అభివృద్ధి కార్యక్రమమైనా అధి ప్రత్యక్షంగా సామాన్య పేద, మధ్య తరగతికి చేరినపుడే అధి నిజమైన ప్రగతి కిందకు వస్తుందని చెప్పారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు వంటివి ఇందులో కీలకమని అన్నారు. మోడీ సర్కారు మాత్రం కనీస ప్రాథమిక సౌకర్యాలలో ముఖ్యమైనవాటిలో భాగమైన ఈ మూడింటినీ నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. ఈ మూడు అంశాల పైన దృష్టి సారించాల్సిన అవసరమున్నదని నొక్కి చెప్పారు. మోడీ తొమ్మిదేండ్ల పాలనలో ఇవి సాధారణ పౌరుడికి తగినవిధంగా అందలేదని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు.
మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం 2014లో కేంద్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన వంటివి ఆశించిన స్థాయిలో ప్రజలకు అందించలేదు. దీంతో దేశం విద్య, వైద్య రంగాల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నదని విశ్లేషకులు తెలిపారు. మౌలిక సదుపాయాల లేమి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని చెప్పారు.
విద్యకు ప్రయివేటు పోటు
విద్య వ్యవస్థలో ప్రయివేటు పాఠశాలలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని విశ్లేషకులు, సామాజికవేత్తలు తెలిపారు. ప్రభుత్వాలు సర్కారు బడులపై దృష్టి సారించకపోవటంతో ప్రయివేటు పాఠశాలలను దానిని తమకు అనుకూలంగా మార్చుకొని విద్యను వ్యాపారంగా చేస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా దీని ప్రభావం సర్కారు బడుల మీద ఆధారపడే, ప్రయివేటు పాఠశాలల ఫీజులను భరించలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద, మధ్య తరగతి ప్రజలపై పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి ఎస్సీ,ఎస్టీ అభివృద్ధి శాఖల వద్ద ఉన్న నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్‌, పుస్తకాలు, అవసరమైన వస్తువులు సక్రమంగా అందేలా చూడాలన్నారు. ప్రస్తుత ఆధునిక కాలంలో ఇంటర్నెట్‌ వసతిని గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో కేరళ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలన్నారు.
ఆరోగ్య సేవలు పేలవం
దేశంలో ఆరోగ్యసేవలు కూడా పేలవంగానే ఉన్నాయి. ఉప్పెనలా వచ్చిన కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఆరోగ్య రంగంలో భారత్‌ ఎంత వెనుకబడి ఉన్నదో చెప్పిందని ఆరోగ్య నిపుణులు, సామాజికవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఆక్సిజన్‌ ప్లాంట్లు, సరిపడా బెడ్లు లేకపోవడం, సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల లేమి.. ఇలా ఆరోగ్య రంగంలోని ప్రతి అంశములోనూ భారత వైఫల్యం బయటపడిందని చెప్పారు. ఈ రంగానికి కూడా విద్యా రంగం ఎదుర్కొంటున్నట్టుగానే ‘ప్రయివేటు’ భారం పడిందని తెలిపారు.
సాధారణంగా కింది స్థాయి నుంచి ఆరోగ్య సేవ అనేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ప్రతి 3వేల మందికి) నుంచి ప్రారంభమవుతుందనీ, వైద్యుడు అందుబాటులో ఉండాలని చెప్పారు. దేశంలోని వేలాది గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిష్క్రియాత్మకంగా ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది కొరత కూడా చాలానే ఉన్నదన్నారు. ప్రభుత్వాలు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచి ప్రజారోగ్యాన్ని కాపాడాలని నిపుణులు, విశ్లేషకులు కోరారు.
రోడ్లు అధ్వాన్నమే
దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో రోడ్ల వ్యవస్థ ఇప్పటికీ అధ్వాన్నంగానే ఉన్నదని చెప్పారు. విద్య, వైద్యం.. ఈ రెండు అంశాలు రోడ్లతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానే ముడిపడి ఉంటాయనీ, చక్కని రోడ్లు అభివృద్ధికి సంకేతాలని తెలిపారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రోడ్ల వ్యవస్థ ప్రభుత్వాలు చేసుకుంటున్నప్రచారాలకు విరుద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు. తమ పాలనలో రోడ్ల అభివృద్ధి అధికంగా జరిగిందని మోడీ ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారాలు సత్య దూరమని చెప్పారు. పల్లె, పట్టణ ప్రాంతాల్లో చక్కటి రోడ్లపై ప్రభుత్వాలు దృష్టి సారించి ప్రజావసరాలను తీర్చాలని వారు సూచించారు.