– రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను తిప్పికొడుదాం : సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా
– పార్టీ శతవార్షికోత్సవ సభను జయప్రదం చేయాలని పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మతోన్మాద, అవినీతి, అప్రజాస్వామిక, విధానాల కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, వామపక్షవాదులు ఐక్యంగా ఉద్యమించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా పిలుపునిచ్చారు. సీపీఐ శత వార్షికోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో పార్టీ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం అజీజ్ పాషా మాట్లాడుతూ సీపీఐ వందేళ్ల ప్రస్థానంలో భారత స్వాతంత్య్ర ఉద్యమం నుంచి ఇప్పటి వరకు అనేక త్యాగాలు, వీరోచిత పోరాటాలున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు అధ్వాన్నంగా సాగుతున్నాయనీ, ప్రజా సమస్యలు చర్చకే రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర వచ్చిన తర్వాత పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్షంగా సీపీఐ నిర్మాణాత్మక పాత్రను పోషించిం డం తో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలను చేపట్టిందని గుర్తు చేశారు. గతంలో రాజ్యసభ చైర్మెన్లు గౌరవంగా వ్యవహరించేవారనీ, ప్రస్తుతం బిజేపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించిన కేంద్ర మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా వెట్టి నుంచి ఈ ప్రాంత ప్రజలను విముక్తి చేశామని అన్నారు. భూమి చట్టాలు, సంక్షేమ పథకాలు, కార్మిక చట్టాలు తమ పార్టీ ప్రజాసంఘాల పోరాట ఫలితమేనని పేర్కొన్నారు. ఎప్పటికైనా భారతదేశంలో ఎర్ర జెండా ఎగరవేసేందుకు పార్టీ శ్రేణులు కంకణ బద్దులు కావాలని పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ సమితి సభ్యులు కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన ఏ రాజకీయ పార్టీకి కూడా ప్రస్తుతం ఒంటరిగా పోటీ చేసి తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర పార్టీలతో కలిసి అధికారంలోకి వచ్చేందుకు పోరాటాలు సాగించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కమ్యునిస్టులకు ప్రపంచ వ్యాప్తంగా అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. నేపాల్, లాటిన్ అమెరికా లాంటి దేశాల్లో అధికారం చేపట్టడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటి.నరసింహ మాట్లాడుతూ నల్లగొండలో ఈ నెల 30న జరగనున్న పార్టీ శతవార్షికోత్సవాల ప్రారంభసభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్.ఛాయాదేవి, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సదస్సు
సీపీఐ వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) అధ్వర్యంలో హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ”కార్మికవర్గ పోరాటాలు-భవిష్యత్ కర్తవ్యాలు” అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు ఎండి. యూసుఫ్, ఎస్. బాలరాజు తదితరులు పాల్గొన్నారు.