
నవతెలంగాణ – పెద్దవంగర
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలకు అందేలా చూడాలని ఉమ్మడి వరంగల్ ప్రత్యేక అధికారి, ఆర్ఆర్ కమీషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండలం, గంట్లకుంట గ్రామంలో కొనసాగుతున్న సర్వే ను క్షేత్రస్థాయిలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే తీరు పై ఆరా తీశారు. అవకతవకలకు తావు లేకుండా పక్కాగా సర్వే చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ కోసం సర్వే చేపడుతుందన్నారు. సంక్షేమ పథకాల అమలు కోసం అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేపట్టాలన్నారు. సాగులో ఉన్న భూములను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, వివరాలు నమోదు చేయాలన్నారు. నాలా కన్వర్షన్లు, రియల్ ఎస్టేట్, పరిశ్రమలకు కేటాయించిన భూములు, వివిధ అభివృద్ధి పనులకు కేటాయించినవి.. తదితర సాగుకు యోగ్యం కాని భూములను రైతు భరోసా జాబితా నుంచి తొలగించాలని అధికారులకు సూచించారు.16వ తేదీ నుంచి 20వ తేదీ లోగా ఎంపిక చేయాలన్నారు. 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి పథకాల పై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తొర్రూరు ఆర్డీవో గణేష్, తహశీల్దార్ వీరగంటి మహేందర్, ఎంపీడీవో వేణుమాధవ్, మండల వ్యవసాయాధికారి గుగులోత్ స్వామి నాయక్, సర్వే అధికారులు పాల్గొన్నారు.