– మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
అగ్ని ప్రమాదంలో కాలిపోయిన తాటి, ఈత వనాలతో ఉపాధి కోల్పోయిన గీత కార్మికులకు అండగా ఉంటామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివారులో ఇటీవల అగ్నిప్రమాదానికి గురైన ఈత, తాటి వనాలను ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన ఘటన కారణాలపై గీతా కార్మికులతో మంత్రి మాట్లాడారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేక కుట్రపురితమా.. అనేది ఎక్సైజ్, పోలీస్ అధికారులు పరిశీలించాలని ఆదేశించారు.
భవిష్యత్‌లో ఈత, తాటి వనాల మొక్కల పెంపకంపై ఎక్సైజ్ అధికారులతో మాట్లాడి ఉపాధి హామీ కింద చెట్లు పెంచే కార్యక్రమం, నీళ్లు పొసే కార్యక్రమం చేపడుతామని తెలిపారు. ప్రకృతి ద్వారా లభ్యమయ్యే తాటి కల్లు, ఈత కల్లు కల్తీ లేకుండా ఇచ్చినట్లయితే అందరి ఆరోగ్యానికి కూడా మంచిదన్నారు. కాలిపోయిన చెట్లపై అధికారులతో మాట్లాడి బాధితులకు సహకారం అందెలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు.