నూతన పార్లమెంట్‌ భవనానికి అంబేద్కర్‌ పేరు పెట్టకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

– అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం వల్లనే నేడు మోడీ ప్రధాని
– తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మెన్‌ గజ్జల కాంతం
– ట్యాంక్‌ బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన
– ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
ఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంట్‌ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ పేరు నామకరణం చేయకపోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మెన్‌ గజ్జల కాంతం అన్నారు. పార్లమెంట్‌ భవనాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతో ప్రారంభోత్సవం చేయించకపోవడాన్ని నిరసిస్తూ ఆదివారం ట్యాంక్‌ బండ్‌ వద్ద ఉన్న డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేద్కర్‌ విగ్రహం ఎదుట జేఏసీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. తొలుత తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అనేక మంది నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్‌ విగ్రహం వద్ద నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సంద ర్భంగా గజ్జల కాంతం మాట్లాడుతూ నరేంద్ర మోడీ తొమ్మి దేండ్ల క్రితం ప్రధాన మంత్రి కాగానే అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం వల్లనే తాను ప్రధాన మంత్రిగా అయ్యానని గొప్పలు చెప్పిన మోడీ నేడు మరిచిపోయారన్నారు. పార్ల మెంట్‌ భవనానికి అంబేద్కర్‌ పేరు నామకరణం చేయా లని దేశంలోని కోట్లాది మంది ప్రజలు ముక్తకంఠంతో కోరుతుంటే ఆవేమి మోడీ లెక్క చేయకుండా మొండిగా నియంతగా పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించారన్నారు. ఆదివాసీ గిరిజన బిడ్డ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతో రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించాల్సిన ఉండగా మోడీ ఇవేమీ పట్టించుకోకుండా బ్రిటీష్‌ పాలకుల తొత్తు అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జయంతి సందర్భంగా పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించడం సిగ్గుచేటు అన్నారు. రాజ్యాం గాన్ని నరేంద్రమోడీ అమలు చేయకుండా అంబేద్కర్‌ను అవమానపరుస్తున్నారన్నారు. బీజేపీ విధానాలను దేశ ప్రజలు గమనిస్తున్నారనీ, రానున్న రోజుల్లో బీజేపీని భూ స్థాపితం చేస్తారని హెచ్చరిచారు. ఆదివాసీలకు గౌరవం ఇవ్వకుండా రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి ఈ విధంగా అవమానించడం అంటే అది అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రయివేటు ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షులు గంధం రాములు, మున్నూరుకాపు మహిళా సంఘం అధ్యక్షురాలు మంజుల వాణి, తెలంగాణ వడ్డెర కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షులు డేరంగుల రామకృష్ణ, జేఏసీ నాయకులు మోహన్‌ నాయక్‌, ఓదేలు, పృథ్వీ కుమార్‌, అనిల్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.