బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటాం

We support the victims in all ways– బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
– అగ్ని ప్రమాద గుడిసె వాసులకు భరోసా
– శాశ్వత గృహ వసతి కల్పిస్తామని హామీ
నవతెలంగాణ- కరీంనగర్‌
అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హామీ ఇచ్చారు. కరీంనగర్‌ ఆదర్శనగర్‌లో మంగళవారం అగ్ని ప్రమాదంలో దాదాపు 21 పూరి గుడిసెలు దగ్ధమైన విషయం విదితమే. బుధవారం ఉదయం ఘటన స్థలాన్ని మంత్రి పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. వారికి శాశ్వత గృహవసతి కల్పిస్తామని చెప్పారు. రాజీవ్‌ స్వగృహతో పాటు వేరేచోట వారు నివాసం ఉండేలా చూస్తామని తెలిపారు.
ప్రజాపాలనలో భాగంగా నియోజకవర్గానికి 3500 నుంచి 4000 ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటు న్నామని, ఇందులో అగ్ని ప్రమాద బాధితులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. పూరి గుడిసెలతో పాటు ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. జిల్లాలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని పేదలకు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి త్వరలో జిల్లాలో పర్యటించనున్నారని, ఈ మేరకు అన్ని సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. మంత్రి వెంట కరీంనగర్‌ ఆర్డీవో కె.మహేశ్వర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసు, స్థానిక కార్పొరేటర్‌ మేచినేని అశోక్‌రావు, కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, వైద్యుల అంజన్‌ కుమార్‌, అధికారులు ఉన్నారు.