విభజన సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం

– భద్రాద్రి రాములోరిని కాపాడుకునేందుకు స్థలాలివ్వండి: మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల ఉమ్మడి సమావేశం ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేయడం అభినందనీయమనీ, అందులో రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నామని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న చిన్న తప్పులు జరిగితే రాద్ధాంతం చేయడం తగదన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో డ్యామ్‌లు, బ్రిడ్జీలు కొట్టుపోతున్న విషయాన్ని ఎత్తిచూపారు. రాష్ట్రంలో పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పాలమూరు నుంచి ప్రజల వలసలను నివారించామనీ, ఇతర రాష్ట్రాల నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకునే దశ నుంచి ఎగుమతి చేసే దశకు ఎదిగామని చెప్పారు. ఎన్‌డీఏ కూటమిలో చంద్రబాబు కీలకమనీ, విభజన అంశాలను కొలిక్కి తేవడంలో ఆయన కీలక పాత్ర పోషించాలని కోరారు. భద్రాచలం రాములోరిని కాపాడుకునేందుకు స్థలాలివ్వాలని విజ్ఞప్తిచేశారు. అక్కడ పార్కింగ్‌, డంపింగ్‌ యార్డులకు కూడా స్థలం లేని విషయాన్ని గుర్తుచేశారు. ఏడు మండలాలను తిరిగి ఇప్పించాలని విన్నవించారు. కృష్ణా, గోదావరి నదులపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చంద్రబాబును కోరారు. జిల్లాల కార్యాలయాల్లోనూ వాటా ఉందని ఏపీ వితండవాదం చేయడం సరిగాదన్నారు. ఆర్టీసీ, దిల్‌ వంటి సంస్థల విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ చుట్టు పక్కల చాలా ఆస్తులున్నాయనీ, వాటిపై కుట్ర పన్నే అవకాశముంది కాబట్టి తెలంగాణ సీఎం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సింగరేణి అనుబంధ సంస్థలున్నాయి కాబట్టి తమకూ వాటా ఇవ్వాలని ఏపీ అడగటం విడ్డూరంగా ఉందన్నారు. 23 సంస్థల్లో ఏపీ వాటా అడుగుతున్నదని చెప్పారు. తొమ్మిది, పది షెడ్యూళ్ల ప్రకారం భూములు ఏ రాష్ట్రంలో ఉంటే అదే రాష్ట్రానికి చెందుతాయని స్పష్టం చేశారు. తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య విభేదాలు రాకుండా సమావేశం జరగాలని ఆకాంక్షించారు. విభజన చట్టం ప్రకారం నడుచుకోవాలనీ, రాముడిని కాపాడుకోవాలని కోరారు.