
నవతెలంగాణ – మాక్లూర్
ఆర్మూర్ లో పసుపు బోర్డు ప్రయత్నాలు జరుగుతున్నాయని నెల రోజుల్లో ప్రధాని మోడీ, హోం శాఖ మంత్రి, అమిత్ షా, చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తానని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ప్రకటించడానికి మా అఖిల భారత రైతు కూలీ సంఘం.( ఏఐకేఎంఎస్ ) స్వాగతిస్తుందని జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. ఆదివారం మండలంలోని బోర్గాం (కే) గ్రామంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నన్ను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డును ఆర్మూర్ లో ఏర్పాటు చేయిస్తానని, ఈ ప్రాంత రైతులకు బాండ్ పేపర్ రాసి ఇచ్చిన ఎంపి అరవింద్ ఇప్పటికీ హామీ నిలబెట్ట లేక రైతులను మోసం చేశారని భూమయ్య అన్నారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున మరొకసారి రైతులను నమ్మబలికేందుకు, తెర లేపడానికి ఇది కుట్రపూరిత వాగ్దానం తప్ప మరొకటి కాదాని, రైతులు అనుమాన పడుతున్నారని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే పసుపు బోర్డు, పసుపు శుద్ధి కర్మాగారాన్ని, ఏర్పాటుకు తగిన( జీ.వో ) విడుదల చేసి రైతుల వద్దకు రావాలని ఇతవు పలికారు. రైతులను మోసం చెయ్యడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ఇప్పటికైనా పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వము ముందుకు వస్తే రైతులు సంతోషిస్తారని, ఆదరిస్తారని లేనట్లయితే ఐక్య ఉద్యమాలతో తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు తడకల కృష్ణ గౌడ్, సహాయ కార్యదర్శి బన్సీ, జిల్లా నాయకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.