– అప్రజాస్వామిక, అవకాశవాద వైఖరిని తిరస్కరించిన ప్రజలు : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఓడిపోయిందనీ, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందనిసీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తెలిపింది. గత పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో అప్రజాస్వామిక, అవకాశవాద వైఖరిని ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించడాన్ని ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యతిరేకతను వినియోగించుకుని కాంగ్రెస్ పార్టీ పూర్తి విజయం సాధించడాన్ని ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ ఓట్లు, సీట్లు పెరగడం మతోన్మాద ప్రమాదం రాష్ట్రంలో తగ్గలేదని ఈ ఫలితాలు సూచిస్తున్నాయని వివరించారు. లౌకిక శక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) చివరి దశలో ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రెండు పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన పోటీ, రూ.కోట్ల డబ్బు ప్రవాహం, చివరి నిమిషంలో ఒంటరిగా పోటీ చేయాల్సి రావడంతో పార్టీ ఓటింగ్ కొంత చెదిరినట్టు గమనించామని వివరించారు. ఏమైనా ఫలితాలను లోతుగా పరిశీలించి లోపాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. కొత్త ప్రభుత్వం పట్ల ప్రజాసమస్యల పరిష్కారం విషయంలో సీపీఐ(ఎం) నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. పార్టీకి ఓటేసిన ఓటర్లకు, అననుకూల పరిస్ధితుల్లోనూ అహర్నిశలూ కృషి చేసిన పార్టీ శ్రేణులకు, సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.