శ్వేతపత్రాలు, న్యాయ విచారణలు స్వాగతిస్తున్నాం

We welcome white papers and judicial inquiries– హామీలు అమలు చేయలేకనే కాంగ్రెస్‌ ప్రభుత్వ డ్రామాలు : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
శ్వేతపత్రాలు, న్యాయ విచారణలను స్వాగతిస్తున్నామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఆవరణంలో గల బీఆర్‌ఎస్‌ఎల్పీలో మీడియా సమావేశం నిర్వహించారు. అందులో ఆయనతో పాటు ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, ముఠాగోపాల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ..ఇచ్చిన హామీలకు నిధులు సమీకరించలేక కాంగ్రెస్‌ నేతలు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. రూ.93 వేల కోట్ల వ్యయంతో కట్టిన ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టు కింద ఒక ఎకరం కూడా పారలేదని ఎన్నికల సమయంలో అసత్యప్రచారం చేశారని విమర్శించారు. ఇప్పుడు వారిచ్చిన నివేదికలోనే 90 వేల ఎకరాల ఆయకట్టు వచ్చిందని చెప్పారన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర తిరిగి ప్రాజెక్టు కడతామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అంటున్నారన్నారు. అక్కడ నీటి లభ్యత లేదని గతంలోనే జలవనరుల శాఖ లేఖ రాసిందని గుర్తుచేశారు. 152 మీటర్ల దగ్గర ప్రాజెక్టును ఒప్పుకునేదే లేదని ఆనాటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్‌ చవాన్‌ స్పష్టం చేశారని తెలిపారు. ఈపీసీ పద్ధతిలో రూ.6వేల కోట్ల దాకా ఆనాటి సీఎం రాజశేఖర్‌రెడ్డి మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ల కింద కాంట్రాక్టర్లకు చెల్లించారన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత 11 రకాల అనుమతులతోనే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ కట్టించారని తెలిపారు. 140 టీఎంసీల మేర సామర్థ్యమున్న రిజర్వాయర్లు కాళేశ్వరం కింద నిర్మించుకున్నాం గనుకనే వ్యయం పెరిగిందన్నారు. మేడిగడ్డ ఫిల్లర్లు కుంగిపోవడం దురదృష్టకరమన్నారు. న్యాయ విచారణను ప్రభావితం చేసేలా మంత్రుల వ్యాఖ్యలున్నాయని విమర్శించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్‌ కేంద్రాన్ని అడగలేదని చెప్పడం శుద్ధ అబద్ధమన్నారు. కాళేశ్వరం కింద ఆయకట్టు పెరగకపోతే ఇన్ని కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి ఎలా సాధ్యమైందని నిలదీశారు. కాంగ్రెస్‌ పార్టీ అబద్దాలు మాని అభయహస్తం హామీల గురించి ఆలోచించాలని సూచించారు. కేసీఆర్‌ ల్యాండ్‌ క్రూసర్‌ వాహనాలు ఏమైనా సొంతం కోసం కొన్నారా? ఆ వాహనాల్లో ఇప్పటి సీఎం, మంత్రులు, అధికారులు తిరుగరా? అని ప్రశ్నించారు. సచివాలయంలో లంకెబిందెలుంటాయా? డబ్బులుంటాయా? అని నిలదీశారు.