కేటీఆర్ ను గెలిపించిన పాపానికి అవమానాలకు గురయ్యాం

– కాంగ్రెస్ నేత మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ – సిరిసిల్ల
కేటీఆర్ ను సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిపించిన పాపానికి అవమానాలు తప్ప ఏమి మిగలలేదని సెల్ఫీలు దిగి ఇండ్లలో ఫోటోలు పెట్టుకోవడం మాత్రమే మిగిలాయని కాంగ్రెస్ నేత మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి అన్నారు. సిరిసిల్లలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంకిత భావంతో పార్టీకి, కేటీఆర్ కు పనిచేసినందుకు అనేక మందిని బిచ్చం బతుకు చేశాడని, నాయకులు కార్యకర్తల కళకళ తగిలి, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని ఆయన అన్నారు. పదేళ్లు నేను నా భార్య ఎల్లారెడ్డిపేట సర్పంచిగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి చాలా నష్టపోయామని, అనేక అవమానాలకు గురయ్యామని, సొంత డబ్బులు ఖర్చు చేసి గ్రామాభివృద్ధి చేశానని ఆయన అన్నారు. ప్రజల మనసు దోచుకోవడానికి సొంత డబ్బులు ఖర్చు చేశానని, నా గ్రామ అభివృద్ధికి జిల్లాలోనే అత్యధిక నిధులు నేను ఖర్చు చేయడం జరిగిందని, ఆయన తెలిపారు. ఎల్లారెడ్డిపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం నా సొంత స్థలం ఎకరం ఇవ్వడం జరిగిందని, నాకు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వలేదని ఆయన అన్నారు. కేటీఆర్ కు నేను దగ్గర అయినప్పటికీ, ఆయన నుంచి నేను ఎలాంటి లబ్ధి పొందలేదని, పార్టీలో కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా సంతోషంగా లేరని అన్నారు. ఎల్లారెడ్డిపేట గ్రామ అభివృద్ధిలో భాగంగా డబ్బులు ఖర్చు చేశానని నాకు రూ.60 నుంచి రూ.70 లక్షల డబ్బు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం సర్పంచులకు తీవ్ర అన్యాయం చేసిందని, సర్పంచులు అప్పుల పాలయ్యారని, అలాగే సిరిసిల్ల నేత కార్మికులకు రూ.260 కోట్లు బతుకమ్మ చీరలకు సంబంధించిన డబ్బులు గత ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని, ఈ పాపం కేసిఆర్, కేటీఆర్ లకే తగులుతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ బంధువులతో పాటు నియోజకవర్గంలో ఓ పదిమంది నాయకులు మాత్రం బాగుపడ్డారని, మేము నాయకులమే అయినప్పటికీ మమ్మల్ని గుర్తించలేదని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రగతిభవన్లోకి వెళ్లడానికి అనుమతి కోసం నాకు ఐదేళ్లు పట్టిందని, సిరిసిల్ల నియోజకవర్గంలోని అనేకమంది నాయకులు నాలాగే ఎంతో అవమానపడ్డారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు కార్యకర్తలకు ఎంతో గౌరవం ఉందని, బీఆర్ఎస్ నాయకులు ఆలోచించాలని, పేదల పార్టీ కాంగ్రెస్ లోకి రావాలని ఆయన కోరారు. నా కుటుంబం అనేక బాధల్లో ఉన్న ఏరకంగా కూడా కేటీఆర్ నాకు సహాయం చేయలేదని, విసిగి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరానని, అనేకమంది బీఆర్ఎస్ పార్టీలో ఉండి అప్పుల పాలై, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్మిరిశెట్టి తిరుపతి, కౌన్సిలర్లు రెడ్డి నాయక్, కుడిక్యాల రవికుమార్, అర్బన్ బ్యాంకు డైరెక్టర్ నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.