రాబోయే కాలంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం

రాబోయే కాలంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం లోపాలను సమీక్షించి పార్టీని పటిష్టం చేస్తాం ొ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గానికి శుభాకాంక్షలు ొ ప్రజాస్వామికంగా పాలన అందించాలి ొ కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలి ొ ఉద్యోగాల కల్పనపై దృష్టిసారించాలి ొ బీజేపీ ఓట్లు, సీట్లు రెట్టింపు ప్రమాదకర సంకేతం ొ అహంభావం, అప్రజాస్వామిక ధోరణుల వల్లే బీఆర్‌ఎస్‌ ఓటమి ొ కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని – ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం
– లోపాలను సమీక్షించి పార్టీని పటిష్టం చేస్తాం
– సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గానికి శుభాకాంక్షలు
– ప్రజాస్వామికంగా పాలన అందించాలి
– కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలి
– ఉద్యోగాల కల్పనపై దృష్టిసారించాలి
– బీజేపీ ఓట్లు, సీట్లు రెట్టింపు ప్రమాదకర సంకేతం
– అహంభావం, అప్రజాస్వామిక ధోరణుల వల్లే బీఆర్‌ఎస్‌ ఓటమి
– కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాబోయే కాలంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామనీ, తమ పార్టీ ఆ బాధ్యతను నిర్వర్తిస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, మంత్రివర్గానికి శుభాకాంక్షలు చెప్పారు. ఈనెల 12,13,14 తేదీల్లో మూడురోజులపాటు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గం, రాష్ట్ర కమిటీ సమావేశాలను హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన నిర్వహించారు.
కేంద్ర పరిశీలకులుగా ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఎ విజయరాఘవన్‌ హాజరయ్యారు. శుక్రవారం తనను కలిసిన విలేకర్లతో తమ్మినేని మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ అనుసరించిన ఎత్తుగడలు, ఫలితాలపై సమీక్షించామని చెప్పారు. తమ ఎత్తుగడలు సంతృప్తికరంగానే ఉన్నాయని అన్నారు. పోటీచేసిన 19 స్థానాల్లో గెలుస్తామని భావించకపోయినా ఓట్లు తక్కువ రావడం ప్రధాన లోపంగా పార్టీ గుర్తించిందని వివరించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు నిర్ణయం కాలయాపన కావడం, చివరి నిమిషంలో పొత్తు సాధ్యం కాదని తేలాక ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందని చెప్పారు. సన్నద్ధం కావడానికి సమయం సరిపోని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయని వివరించారు. బీఆర్‌ఎస్‌ మీద కోపం ఉన్న వారు కాంగ్రెస్‌కు, కాంగ్రెస్‌ మీద వ్యతిరేకత ఉన్న వారు బీఆర్‌ఎస్‌కు ఓటేశారని చెప్పారు. సీపీఐ(ఎం) పట్ల అభిమానం ఉన్న వారు కూడా తమకు ఓటేయలేదని అన్నారు. సీపీఐ(ఎం) కుటుంబాలే ఓటేశాయి తప్ప సంప్రదాయంగా వేసే అభిమానులు ఈసారి ఓటేయలేదని వివరించారు. పార్టీ కమిటీలు, శాఖల్లోనూ గణనీయంగా లోపాలు జరిగాయని అన్నారు. ఈ లోపాలను సమీక్షించుకుని భవిష్యత్తులో పార్టీని పటిష్టం చేయడానికి అవసరమైన నిర్ణయాలు చేశామని చెప్పారు.
2 గ్యారంటీలను అమలు చేయడం శుభపరిణామం
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారంలోనే రెండు గ్యారంటీలను అమలు చేయడం శుభపరిణామమని తమ్మినేని చెప్పారు. వివిధ శాఖలపై సమీక్షలు, లోపాలను గుర్తించడం, వాటిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించడం సానుకూల సంకేతమని అన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి చేసిన వాగ్దానాలను అమలు జరపాలని కోరారు. ప్రజాస్వామికంగా పాలన అందించాలని సూచించారు. అలా జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.
కేసీఆర్‌ గాయపడడం బాధాకరం
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గాయం కావడం, తుంటి ఎముక విరగడం, ఆస్పత్రిలో చేరడం, ఆపరేషన్‌ జరగడం బాధాకరమని తమ్మినేని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రైతాంగాన్ని ఆదుకోవాలి
ఇటీవల సంభవించిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారని తమ్మినేని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగాన్ని ఆదుకునే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని కోరారు. వాయిదా పడిన పోటీ పరీక్షలను నిర్వహించాలని సూచించారు.
నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టిసారించాలని కోరారు. వ్యవసాయ కార్మికులు, గిరిజనులు, గ్రామీణ పేదల విషయంలో కాంగ్రెస్‌ వాగ్దానాలను అమలు చేయాలని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని అన్నారు.
ప్రజలకు కృతజ్ఞతలు
ఈ ఎన్నికల్లో పార్టీ కోసం రాష్ట్రవ్యాప్తంగా పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు తమ్మినేని ధన్యవాదాలు చెప్పారు. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్న ఈ తరుణంలోనూ పార్టీని ఆదరించి ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు ప్రకటించారు.
బీఆర్‌ఎస్‌ను ఓడించాలనుకున్న ప్రజలు
రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామనీ, వివిధ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దామని చెప్తూ బీఆర్‌ఎస్‌ ప్రజల్లోకి వెళ్లిందని తమ్మినేని అన్నారు. అయితే అభివృద్ధి కంటే ఈ పదేండ్ల కాలంలో వారి అహంభావం, అప్రజాస్వామిక ధోరణులను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్‌ను ఓడించాలని భావించారని అన్నారు. బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత కాంగ్రెస్‌కు దోహదపడిందన్నారు. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర, రేవంత్‌రెడ్డి నాయకత్వం, కర్నాటకలో విజయం, అధిష్టానం చొరవ, కాంగ్రెస్‌లో గ్రూపులన్నీ ఏకం కావడం వంటి పరిణామాలన్నీ కాంగ్రెస్‌ గెలుపునకు తోడ్పడ్డాయని వివరించారు.
బీజేపీ గెలుపుపై లౌకికశక్తులు అప్రమత్తంగా ఉండాలి
మునుగోడు ఎన్నికల ముందు ప్రదర్శించిన జోరు ఆ ఫలితాల తర్వాత బీజేపీలో కనిపించలేదని తమ్మినేని అన్నారు. గత ఎన్నికలతో పోల్చితే బీజేపీకి ఓట్లు, సీట్లు రెట్టింపయ్యాయనీ, ఇది ఓ ప్రమాదకర సంకేతమని చెప్పారు. రాష్ట్రంలో మతోన్మాద శక్తులు బలపడడానికి ఇది సంకేతంగా ఉందన్నారు. లౌకికశక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే కాలంలో తమ పార్టీ ఆ దిశగా చొరవ చూపుతుందని అన్నారు.