– ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జాతీయ ఆరోగ్య మిషన్‌కు బకాయి ఉన్న రూ.వెయ్యి కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. లేకపోతే రాష్ట్రంలోని బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్య7్నలు ఎం.నరసింహ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పని చేస్తున్న 17 వేల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రావడం లేదని తెలిపారు. గత ఆరు నెలల నుంచి కేంద్రం నిధులు ఇవ్వకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఎన్‌హెచ్‌ఎం డైరెక్టర్ చెప్పారని గుర్తుచేశారు. దీంతో ఉద్యోగులను ఆదుకునేందుకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తుచేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకురాలేని బీజేపీ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులు, వారి కుటుంబాలు అర్థాకలితో అలమటిస్తుంటే ఎందుకు స్పందించడం లేదని బీజేపీ నాయకులను ఆయన ప్రశ్నించారు.