ముదిరాజ్ లకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఏ పార్టీనైన బహిష్కరిస్తాము

నవతెలంగాణ- తాడ్వాయి
ముదిరాజ్ లకు ప్రాధాన్యత ఇవ్వకపోతే బీఆర్ఎస్ సహా ఏ పార్టీనైన బహిష్కరిస్తామని మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి అబ్రబోయిన స్వామి అన్నారు. కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్ లలో అసంతృప్తికి కారణం కేసీఆర్ మాత్రమేనన్నారు. తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరవీరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ అనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 మంది ముదిరాజ్ లు చనిపోయారని గుర్తు చేశారు. అలాంటి తమకు ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. కామారెడ్డి నియోజకవర్గంలో 50 వేలు, ఎల్లారెడ్డిలో 70 వేలు, జుక్కల్, బాన్సువాడ నియజకవర్గాల్లో 40 వేల చొప్పున ముదిరాజ్ లు ఉన్నారని, గెలుపోటములు శాసించే స్థాయిలో ఉన్న తమను పట్టించుకోని ఏ పార్టీ అయినా తాము బహిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 8 న కామారెడ్డిలో నిర్వహించే ముదిరాజ్ మేధావుల రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా లీగల్ అడ్వైజర్ సూర్యప్రసాద్  కాకర్ల శేఖర్, కిష్టయ్య, అశోక్, లింగం, దేవేందర్, ప్రభాకర్ బాల్రాజ్ రాజలింగం నారాయణ దేవరాజ్ పాల్గొన్నారు.