చివరి గింజ వరకు కొంటాం.. తప్పుడు ప్రచారం తగదు

– అదనంగా 450 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
– దిగుబడి ఆలస్య నివారణకు ప్రత్యాన్మయ చర్యలు తీసుకోవాలి
– పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా పంట విస్తీర్ణం, ధాన్యం దిగుబడి బాగా పెరిగిందని, రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకు మద్దతు ధరపై ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌, పౌర సరఫరాల కమిషనర్‌ తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ధాన్యం కొనుగోలు అంశంపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు అంశంలో జిల్లా కలెక్టర్లు, అధికారులు తీసుకున్న చర్యల కారణంగా గత సంవత్సరం కంటే అధికంగా ధాన్యం కొనుగోలు చేశామని, అయినప్పటికీ క్షేత్రస్థాయిలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. గత సంవత్సరంలో 4.5 లక్షల రైతుల నుంచి 28 లక్షల 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం మే 23 నాటికి 6.4 లక్షల రైతుల నుంచి 38 లక్షల 50 వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశామని గత సంవత్సరం కంటే అధికంగా 450 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని మంత్రి తెలిపారు. జిల్లాలో కురిసిన అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని సైతం రైతులు నష్ట పోవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కొనుగోలు చేశామని తెలిపారు. జిల్లాలలో రైస్‌ మిల్లుల వద్ద ధాన్యం దిగుబడికి స్థల సమస్య ఉందని, దీనివల్ల లారీల మూమెంట్‌, మిల్లుల వద్ద ధాన్యం దిగుబడి ఆలస్యం అవుతుందని, దీనిని నివారించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇంటర్మీడియట్‌ గోడౌన్లో భద్రపరచాలని, జిల్లాలో ఇంటర్మీడియట్‌ గోడౌన్‌ లను గుర్తించాలని మంత్రి ఆదేశించారు. రైస్‌ మిల్లుల వద్ద లోడింగ్‌, అన్లోడింగ్‌ సమస్య రాకుండా అధిక సంఖ్యలో హమాలీలు ఏర్పాటు చేసుకోవాలని, జిల్లాల వారీగా అవసరమైతే లారీల సంఖ్యను పెంచాలని రైతుల వద్ద చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్‌ టి. వినరు కష్ణా రెడ్డి మాట్లాడుతూ, తడిచిన ధాన్యం ను కొనుగోలు చేసి మిల్లర్‌ లకు పంపించిన ధాన్యం మిల్లింగ్‌ చేసిన బాయిల్డ్‌ రైస్‌ ఎఫ్సీఐ తీసుకోవడం లేదని తెలియజేశారు. అంతేగాక 130 కొట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని వివరించారు. రైస్‌ మిల్లుల వద్ద ధాన్యం దిగుబడి సమస్య రాకుండా అలాట్‌ చేసిన రైస్‌ మిల్లులు తప్పనిసరిగా ధాన్యం దిగుమతి చేసుకునేలా ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షిస్తున్నామని, రైస్‌ మిల్లుల వద్ద స్థల సమస్య ఉంటే ప్రత్యామ్నాయ స్థలాల ఎంపిక చేపడుతామని, ప్రస్తుతానికి రైస్‌ మిల్లుల వద్ద అందుబాటులో ఉన్న స్థలంలో దాన్యం దిగుబడి చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) భాస్కర్‌ రావు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, పౌసరఫరాల సంస్థ మేనేజర్‌ నాగేశ్వర రావు, డి అర్‌ డి ఓ కాళిందిని, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.