– కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్ట్‌లపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
– ఎంపీ సభ్యత్వానికి రాజీనామా
– సోనియా, రాహుల్‌తో భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, మేడిగడ్డ కుంగిన ఘటనలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలా? లేక రాష్ట్ర ఏజెన్సీలతో విచారణ చేయాలా? అన్నది సీఎంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
మేడిగడ్డ అంశంలో డిజైన్, అమలు, నిర్వహణ, నిబద్ధతలో లోపాలున్నాయని విమర్శించారు. దీనికి జావాబుదారీ ఎవరన్నది తేలుస్తామని, ఇందులో అధికారుల పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో సతీమణి, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి ఉత్తమ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్ట్ విషయంలో అవినీతిని తేల్చి, పారదర్శకంగా ముందుకు వెళ్తామన్నారు. మొదట ఫైనల్ స్టేజ్‌లో ఉన్న ప్రాజెక్ట్ పనులను పూర్తిచేసి, తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పారు. పౌర సరఫరాల శాఖలోనూ జవాబుదారి తనం తెస్తామన్నారు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద రాష్ట్రంలో పేదలకు పంచిన బియ్యం నాణ్యత లేకపోవడంతో 90 శాతం రీ సైకిలింగ్ అయ్యేవని చెప్పారు.
పౌర సరఫరాల శాఖలో ధాన్యం కొనుగోళ్లను మరింత పటిష్టం చేసి… రైతులకు మేలు చేస్తామని వెల్లడించారు. ఇరిగేషన్, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టుల్లో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసినా, ఆశించిన ఫలితాలు, ప్రయోజనం మాత్రం రాలేదన్నారు.
ఎంపీ సభ్యత్వానికి రాజీనామా
హుజూర్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నకైన నేపథ్యంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం తన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి… జన్ పథ్ 10లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను మర్యాదపూర్వకంగా కలిసారు. రాష్ట్ర మంత్రివర్గంలో తనకు చోటు కల్పించినందుకు అగ్రనేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు
గత బీఆర్‌ఎస్ సర్కార్ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి, వాస్తవాలను దాచి తెలంగాణను అప్పుల్లో ముంచిందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఎంపీగా తాను అడిగిన ప్రశ్నలతోనే కార్పొరేషన్లు, పలు సంస్థల నుంచి బీఆర్‌ఎస్ సర్కార్ తీసుకొన్న అప్పులు వివరాలను బయటకు వచ్చాయన్నారు. గడిచిన నాలుగున్నర ఏండ్లలో దాదాపు లక్ష కోట్లు ఈ కార్పొరేషన్ల నుంచి అప్పు తీసుకుందన్నారు. ఇక రూ.67వేల కోట్ల అప్పులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే… గడిచిన తొమ్మిదిన్నరేండ్ల బీఆర్‌ఎస్ సర్కార్ ఆ అప్పును ఏకంగా రూ.4.50లక్షల కోట్లకు పెంచిందన్నారు. దీంతో ప్రతి తెలంగాణ బిడ్డపై తలసరి అప్పు రూ.20 వేల నుంచి, రూ. లక్షకు పెరిగిందని ఫైర్ అయ్యారు. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి రూ.81వేల కోట్లు, పౌర సరఫరాల శాఖకు సంబంధించి రూ.56వేల కోట్లు అప్పులున్నాయని తేలిందని, ఇరిగేషన్‌కు సంబంధించి రూ.10వేల కోట్ల బకాయిలు ఉన్నాయని ఉత్తమ్ తెలిపారు. ఎంపీగా తెలంగాణకు సంబంధించి ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు, రాష్ట్రంలో ట్రైబల్ రిజర్వేషన్ల పెంపు, బీబీ నగర్ ఏయిమ్స్ నిర్మాణం, ధాన్యం కొనుగోలు, తెలంగాణ బొగ్గు గనుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పలు ప్రశ్నలు లేవనెత్తినట్టు చెప్పారు.