రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేస్తాం

రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేస్తాం– ఒకే గొడుగు కింద ‘రియాల్టీ’ అనుమతులు
– కాంగ్రెస్‌తోనే హైదరాబాద్‌ అభివృద్థి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
– ఘనంగా క్రెడారు ప్రాపర్టీ షో ప్రారంభం
నవతెలంగాణ – బిజినెస్‌ / బ్యూరో
రాష్ట్రంలోని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం స్నేహపూర్వకమైందని.. ఒకే గొడుగు కింద రియాల్టీకి చెందిన అన్ని అనుమతులు పొందేలా కృషి చేస్తానని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో క్రెడారు ప్రాపర్టీ షోను ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చి మూడు మాసాలు అవుతోందని.. ఈ కాలంలో గత ప్రభుత్వ తప్పిదాలను అవగాహన చేసుకోవడానికే సమయం పట్టిందన్నారు. రియాల్టీ వర్గాన్ని ఇబ్బంది పెట్టే యోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు. బిల్డర్లు ఇచ్చే సూచనలను ప్రభుత్వం తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుందన్నారు.”గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణితో సామాన్య ప్రజల నుంచి రియల్‌ ఎస్టేట్‌ వర్గాల వరకు అనేక ఇబ్బందులు పడ్డారు. రెవెన్యూ వ్యవస్థలోని లొసుగులను పరిష్కరిస్తాం. అందుకోసం కసరత్తు జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్‌ కృషి వల్లే హైదరాబాద్‌ నగరం దేశ, విదేశాల్లో గుర్తింపు పొందింది. అప్పుడు నీటి సమస్యను పరిష్కరించడం ద్వారానే నగరం మరింత అభివృద్థి చెందింది. ఒఆర్‌ఆర్‌, అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కాంగ్రెస్‌ చేసిన కృషి. హైదరాబాద్‌ అంటే సెక్యూలర్‌, సేఫ్‌ ప్లేస్‌ అని గుర్తింపు పొందింది. మీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో సంపాదించే ప్రతీ పైసాకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. రియాల్టీ వర్గాలు కోరిన అనుమతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాము. రోడ్డు సెక్టార్‌ను పూర్తి స్థాయిలో అభివృద్థి చేయడానికి సిద్దంగా ఉన్నాము. మాజీ సిఎం రాజశేఖర్‌ రెడ్డి హాయంలోనే హైదరాబాద్‌ మార్కెట్‌ భారీగా పెరిగింది. అదే స్థాయిలో ఇప్పటికీ పెరుగుతోంది. కాంగ్రెస్‌ అంటేనే అభివృద్థి. రియాల్టీ వర్గాల అనుమతులను ఒకే గొడుగు క్రిందికి తీసుకొస్తాము. రిజిస్ట్రేషన్‌ విభాగాన్ని ప్రక్షాళన చేస్తాము.” అని మంత్రి పొంగులేటి అన్నారు.
ప్రదర్శనకు 100 ప్రాజెక్టులు..
హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో 8 నుండి 10 మార్చి 2024 వరకు జరుగనుంది. ఈ షో లో క్రెడారు సభ్యుల నుండి 100 కంటే ఎక్కువ రెరా ఆమోదించబడిన ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. అత్యంత విశ్వసనీయమైన క్రెడారు హైదరాబాద్‌ ప్రాపర్టీ షో 2024లో తమ కలల ఇంటిని ఎంచుకోవడానికి మరియు ఒకే పైకప్పు క్రింద ఉత్తమమైన డీల్‌లను పొందేందుకు అత్యుత్తమమైన ‘మౌకా’ గహ కొనుగోలుదారులకు లభిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. క్రెడారు హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ వి రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ”హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం పోత్సాహకరంగా ఉంది. నివాస, వాణిజ్య, రిటైల్‌ రియల్‌ ఎస్టేట్‌లో నిరంతర వృద్థిని సాధిస్తోంది. ఫిబ్రవరిలో, రాష్ట్రం నమోదైన ఆస్తుల సంఖ్య పరంగా 21 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే నమోదైన ఆస్తుల విలువలో 42 శాతం పెరుగుదల కనిపించింది. రూ.25-50 లక్షల ధరల శ్రేణి గృహాలకు కూడా డిమాండ్‌ బాగుంది. సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించిన మెగా మాస్టర్‌ ప్లాన్‌ 2050 ద్వారా ఆయన దూరదృష్టి నగర అభివృద్థికి మరింత దోహదం చేయనుంది.” అని అన్నారు. ”బ్రాండ్‌ హైదరాబాద్‌’ను ఉన్నతీకరించడానికి నిరంతర ప్రయత్నాల తో నగరం తాజా పెట్టుబడులను ఆకర్షిస్తుంది, మరిన్ని ఉద్యోగాలను సష్టించడం తో పాటుగా నగరంలో రియల్‌ ఎస్టేట్‌ వద్ధికి సహాయపడుతుందని రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడారు ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ ఎస్‌ జైదీప్‌ రెడ్డి, జనరల్‌ సెక్రటరీ బి జగన్నాథరావు, ప్రాపర్టీ షో కన్వీనర్‌ కొత్తపల్లి రాంబాబు, కార్యదర్శి వర్గ సభ్యులు బి ప్రదీప్‌ రెడ్డి, సి జి మురళీ మోహన్‌, ఎం శ్రీకాంత్‌, మనోజ్‌ కుమార్‌ అగర్వాల్‌, క్రాంతి కిరణ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.