ధరణిపై ఆధారాలతో వస్తాం

We will come with evidence on Dharani– మీడియాతో మంత్రి పొంగులేటి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ధరణిపై స్పష్టమైన ఆధారాలతో త్వరలోనే మీడియా ముందుకు వస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశ వివరాలను ఆయన వెల్లడించారు. డిసెంబర్‌ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీవరకు ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తుల్ని ప్రజాపాలన కార్యక్రమం ద్వారా స్వీకరిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన విధివిధానాలను డిసెంబర్‌ 28వ తేదీలోపే గ్రామ సభలకు అందచేస్తామన్నారు. 6 గ్యారెంటీలకు ప్రజలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కలెక్టర్ల సమావేశం గతంలో మాదిరి వన్‌సైడ్‌గా జరగలేదనీ, అధికారులంతా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించారని చెప్పారు. ధరణి పేరు మీద గత ప్రభుత్వంలో పెద్దలు ప్రభుత్వ భూముల్ని తమ పేరుపై రిజిష్టర్‌ చేసుకున్నారనీ, అలాంటి మరికొన్ని ఫైల్స్‌ ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆ రికార్డులు అన్నీ తీసి, ధరణి భాగోతాలను కచ్చితంగా ప్రజల ముందు పెడతామనీ, దీనిపై అధికారులతో ఒక రోజంతా సమీక్ష చేయాల్సి ఉందని తెలిపారు. త్వరలోనే దాన్నీ ఏర్పాటు చేస్తామన్నారు. అప్పుచేసి ఆస్తులు కూడబెట్టామని బీఆర్‌ఎస్‌ నేతలు చెప్తున్నారనీ, ఉన్న సెక్రటేరియట్‌ కూలగొట్టి విలాసవంతమైన భవనం కట్టడం ఆస్తి ఎలా అవుతుందని ప్రశ్నించారు. విద్యుత్‌ సంస్థలు రూ.81వేల కోట్ల అప్పుల్లో ఉన్న విషయాన్ని శాసనసభలో ఆపార్టీ నేతలే అంగీకరించారని చెప్పారు. ‘ప్రజాపాలన’ను విజయవంతం చేయాలని కోరారు.