నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల నిర్ధారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ప్రజలందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుందని ఆ కమిషన్ చైర్మెన్ బి. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సమగ్రంగా నివేదికను తయారు చేసిన తర్వాత ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని కమిషన్ చైర్మెన్ కార్యాలయంలో నిర్వహించిన బహిరంగ విచారణలో ప్రజలు నుంచి విలువైన సమాచారం లభించిందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని అనుసరించి, సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి, బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను నిర్ధారించడం కోసం అవసరమైన నివేదికను తయారు చేయడానికి స్వఛ్చంద సంస్థల(ఎన్టీవో), కుల సంఘాలు, సంక్షేమ సంఘాలతో మంగళవారం బహిరంగ విచారణను నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. జిల్లాలు పర్యటించి అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని నివేదిక తయారు చేస్తామని ప్రకటించారు.