– సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ
– సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘అరికట్ల’ సంతాప సభ
నవతెలంగాణ-ముషీరాబాద్
ప్రజాపక్షపాతి, విప్లవ శ్రేయోభిలాషి అరికట్ల రామకృష్ణారెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ నాయకులు అన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం అరికట్ల రామకృష్ణారెడ్డ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నవ్య ప్రింటర్స్ ప్రెస్ నిర్వాహకులు కామ్రేడ్ అరికట్ల రామకృష్ణారెడ్డి మన మధ్య లేకపోవడం తీవ్రంగా కలిసి వేస్తున్నదని అన్నారు. చిన్నతనం నుంచే ప్రజా విప్లవ నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని.. విద్యార్థి సంఘాల్లో సైతం చురుకైన పాత్ర పోషిస్తూ.. విప్లవ రాజకీయాల వైపు దృఢంగా నిలబడ్డారని తెలిపారు.
ఈ కాలమంతటా లెక్కకు మిక్కిలి సన్నిహితులను, అభిమానులను, సహచరులను, ఉద్యమకారులను సృష్టించుకున్నారని చెప్పారు. ఆయన మరణం ప్రగతిశీల, ప్రజాస్వామిక, సామాజిక, విప్లవోద్యమాలకు తీరని లోటుగా తెలిపారు. కవిగా, రచయితగా, కార్టూనిస్టుగా కూడా విప్లవ, ప్రజా సాహిత్యోద్యమంలో తన వంతు పాత్రను పోషించారన్నారు. ప్రజా ఉద్యమాల పక్షపాతిగా, ప్రెస్ నిర్వాహకుడిగా, ఉత్తమ పబ్లిషర్‌గా రామకృష్ణారెడ్డి సాగించిన కృషి, సేవలు ప్రశంసించదగినవన్నారు. ఆయన ఆశయ సాధనకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అనురాధ, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య, రాష్ట్ర అధ్యక్షులు మామడాల బిక్షపతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్, విరసం నాయకులు విమల, సామాజిక విశ్లేషకులు కాకర్ల సంజయ, ఓయూ ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు, ప్రొఫెసర్ కాశీం, ప్రొఫెసర్ సమున్నత, రామకృష్ణారెడ్డి సోదరి జానకి, ఆయన జీవిత సహచరి ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య, ప్రజా రచయిత జీవన్ హాజరై రామకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.