తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తాం

We will continue the legacy of Telangana armed struggle–  బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు సాయుధ పోరాటంతో సంబంధం లేదు
–  కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే తెలంగాణకు విముక్తి :ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్‌ గాదగోని రవి
నవతెలంగాణ-ముషీరాబాద్‌
తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తామని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్‌ భవన్‌ బీయన్‌ హల్‌లో ఎంసీపీఐ(యూ) గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యదర్శి కామ్రేడ్‌ మైదంశెట్టి రమేష్‌ అధ్యక్షతన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల ముగింపు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాగిన పోరాటం మూలంగానే ప్రజలకు దోపిడీ, పీడనల నుంచి విముక్తి కలిగిందన్నారు. నిజాం పాలనలో భూములన్నీ దొరలు, జాగీర్దార్లు, జమీందార్ల చేతుల్లో ఉండేవని, వారికి వ్యతిరేకంగా భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాయుధ పోరాటం సాగించి పది లక్షల ఎకరాలను పేదలకు పంపిణీ చేశారని తెలిపారు. బీజేపీ వాస్తవ చరిత్రను వక్రీకరిస్తోందని విమర్శించారు. భీంరెడ్డి నర్సింహరెడ్డి, మద్దికాయల ఓంకార్‌, మద్దికాయల లక్ష్మక్క, బొమ్మగాని ధర్మబిక్షం, దేవులపల్లి వెంకటేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, చిట్యాల ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, మల్లు స్వరాజ్యం లాంటి కమ్యూనిస్టు యోధులు సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం హిందూ మతాన్ని రెచ్చగొట్టడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. ప్రజలు అధిక ధరలు, నిరుద్యోగం, మద్దతు ధర, రాజ్యాంగ పరిరక్షణ, మహిళా రిజర్వేషన్లు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలపై పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం అమరజీవి కామ్రేడ్‌ భీంరెడ్డి నరసింహరెడ్డి కూతురు రాజేశ్వరి మాట్లాడుతూ.. సాయుధ పోరాటానికి భీంరెడ్డి నరసింహరెడ్డి ఎంతో త్యాగం చేశారని, కమ్యూనిస్టు పార్టీలు అన్ని ఐక్యమై సాయుధ పోరాట స్ఫూర్తితో పోరాడాలని తెలిపారు. సభానంతరం ఓంకార్‌ భవన్‌ నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు ‘మతోన్మాదం నశించాలి.. దోపిడీ వ్యతిరేకంగా పోరాడాలి’ అంటూ నినాదాలు చేస్తూ పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్‌, కుంభం సుకన్య, వి.తుకారాం నాయక్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు తాండ్ర కళావతి, పి.భాగ్యమ్మ, ఏ.పుష్ప, గాదె మల్లేష్‌, యం.రమేశ్‌, టి.అనీల్‌ కుమార్‌, పి.మురళి, గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యదర్శి వర్గ సభ్యులు ఇ.దశరథ్‌ నాయక్‌, యల్‌.రాజు, మేడ్చల్‌ జిల్లా కమిటీ సభ్యులు మార్టిన్‌, రవీందర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.