సంక్షేమం కొనసాగిస్తాం విశాఖ నుండి పాలన

సంక్షేమం కొనసాగిస్తాం
విశాఖ నుండి పాలన– వైసిపి మ్యానిఫెస్టో విడుదల చేసిన జగన్మోహన్‌రెడ్డి
– ప్రత్యేక హోదా కోసం కృషి
– వచ్చే ఐదేళ్లలో పోలవరం పూర్తి
– వైఎస్‌ఆర్‌ చేయూత రూ.1.50 లక్షలకు పెంపు
అమరావతి : రానున్న ఐదేళ్ల కాలంలోనూ సంక్షేమాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం ఆయన వైసిపి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఒక్కో పథకం, దాని లక్ష్యాలను వివరించారు. గత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామని, రానున్న ఐదేళ్ల కాలంలోనూ అదే స్ఫూర్తితో పనిచేస్తామని ఎప్పారు. రానున్న ఐదేళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. విశాఖను పరిపాలన రాజధానిగా అభివృద్ధి చేస్తామని అదే విధంగా అమరావతిని శాసన రాజధానిగానూ, కర్నూలును న్యాయ రాజధానులుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
భూముల రీసర్వే చేస్తామని వివరించారు. వైఎస్‌ఆర్‌ చేయూతను రూ.1.50 లక్షలకు, జగనన్న అమ్మఒడి రూ.17 వేలకు పెంచుతామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో పదిలక్షల ఇళ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఏటా ఇస్తున్న రూ.13,500 రైతు భరోసాను రూ.16 వేలకు పెంచుతామని, ప్రతి నియోజకవర్గం లో స్కిల్‌ హబ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామన్నారు. 25 వేలు జీతం పొందే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా నవరత్నాలు అమలు చేస్తామని హామీనిచ్చారు. ప్రాధాన్యతాక్రమంలో జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో మధ్య తరగతి ప్రజల కోసం గృహ నిర్మాణం కింద వచ్చే ఐదేళ్లలో ఏడాదికి రూ.1000 కోట్లు ఇస్తూ రూ.2000 కోట్లు కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తామని వివరించారు. సున్నావడ్డీ పథకాన్ని, వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీతోఫా ఇస్తామని, పెళ్లికి రాయితీలు పొందాలంటే పదోతగరతి ఖచ్చితంగా చదవాలని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌ ఇబిసి నేస్తం కింద వచ్చే ఐదేళ్లలో ఏడు విడతల కింద రూ.1.05 లక్షల వరకూ రుణం అందిస్తామని చెప్పారు.