– హెచ్‌సీఏ ప్యానల్ ఫర్ గుడ్ గవర్నెన్స్
నవతెలంగాణ-హైదరాబాద్
హైదరాబాద్ క్రికెట్ సంఘంలో అవినీతిని సమూలంగా అంతం చేస్తామని, అధికార వికేంద్రకరణతో సుపరిపాలన అందించి పూర్వ వైభవం తీసుకొస్తామని హెచ్‌సీఏ పోల్ ప్యానల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించింది. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్యానల్ మ్యానిఫెస్టో విడుదల చేసింది. ‘హెచ్‌సీఏలో నెలకొన్న ప్రధాన సమస్య అవినీతి. ఆట అభివృద్ది, జట్ల ఎంపికలో అవినీతి ఎక్కువైంది. మా ప్యానల్ గెలిస్తే.. అవినీతిని పూర్తిగా అంతం చేస్తాం. అధికార వికేంద్రీకరణతో క్లబ్ కార్యదర్శులతో సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్‌లో క్రికెట్ అభివృద్ధితో పాటు కొత్త జిల్లాల్లోనూ క్లబ్‌లకు సభ్యత్యాలు అందజేస్తాం. ఆర్థిక, క్రికెట్, నిర్వహణ వ్యవహారాలను పూర్తిగా చక్కబెడతాం. తెలంగాణ ప్రీమియర్ క్రికెట్ లీగ్ నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని’ ప్యానల్ తరఫున అధ్యక్షుడిగా పోటీచేస్తున్న కె. అనిల్‌కుమార్ తెలిపారు. ఈ ప్యానల్ తరఫున ఉపాధ్యక్షుడిగా దల్జీత్ సింగ్, కార్యదర్శిగా వి. ఆగమ్ రావు, సంయుక్త కార్యదర్శిగా టి. బసవరాజు, కోశాధికారిగా పి. మహేంద్ర, కౌన్సిలర్‌గా వినోద్ ఇంగ్లేలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.