– లోక్‌సభలో ప్రధాని మోడీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మణిపూర్‌లో త్వరలో శాంతిని నెలకొల్పుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ సుధీర్ఘంగా 2్ణ13 నిమిషాల పాటు మాట్లాడారు. ”ఈశాన్య రాష్ట్రాల భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి కాంగ్రెస్ ఎన్నడూ ప్రయత్నించలేదు. నేను 50 సార్లు సందర్శించాను. మణిపూర్‌లో ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మాగాంధీ చిత్రపటాన్ని అనుమతించనప్పుడు ఎవరి ప్రభుత్వం ఉంది, పాఠశాలల్లో జాతీయ గీతాన్ని అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నప్పుడు మణిపూర్‌లో ఎవరి ప్రభుత్వం ఉంది?… వారి (ప్రతిపక్ష) బాధ సెలెక్టివ్. వారు రాజకీయాలకు అతీతంగా ఆలోచించలేరు” అని అన్నారు. మణిపూర్‌లో శాంతిని నెలకొల్పేందుకు ప్రతిజ్ఞ చేశారు. ”నిందితులను శిక్షించి రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పగలు రాత్రి శ్రమిస్తున్నాయి. మణిపూర్ ప్రజలకు దేశం మొత్తం అండగా ఉంటుందని నేను వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నానుసస అని ప్రధాని మోడీ అన్నారు. నిందితులను శిక్షించడానికి ప్రభుత్వం సాధ్యమైనదంతా చేస్తుందని, త్వరలో శాంతి నెలకొంటుందని మణిపూర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. ”ఈశాన్య రాష్ట్రాల సమస్యలన్నింటికీ మూల కారణం కాంగ్రెస్ మునుపటి విధానాలే” అని విమర్శించారు. ”ప్రపంచం భారతదేశాన్ని గౌరవిస్తుంది. ఎందుకంటే దేశంలోని ప్రజలు తమపై, దేశంపై నమ్మకం ఉంచడం ప్రారంభించారు. ప్రజల విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేయవద్దు” అని అన్నారు. ప్రతిపక్షాలు కేంద్రంపై పదేపదే అవిశ్వాసం పెట్టి అభాసుపాలవుతున్నాయని, వారి అవిశ్వాస తీర్మానాల వల్ల ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతోందని అన్నారు. బహుశా ఆ భగవంతుడే దిగొచ్చి.. ప్రతిపక్షాలకు అవిశ్వాసం పెట్టమని చెప్పి ఉంటాడంటూ అన్నారు. ప్రతిపక్షం ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాసం తమకు అదృష్టమేనన్న మోడీ, తాము మరోసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయని, అందుకే ఈ అవిశ్వాసం తీసుకొచ్చాయని అన్నారు. ఇదే సమయంలో.. 2018లో ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని మోడీ గుర్తు చేసుకున్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలు అనేకసార్లు విశ్వాసం చూపించారని ఉద్ఘాటించారు. ప్రతిపక్షాలు వరుసగా నోబాల్స్ వేస్తుంటే, అధికార పక్షం ప్రతీసారి ఫోర్లు, సిక్సులు కొడుతోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ.. అన్ని రికార్డులు బద్దలుకొట్టి ఎన్‌డిఎ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అవిశ్వాసం శక్తివంతమైనది ప్రధానమంత్రిని సభకు రప్పించింది
లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృ త్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మా నంపై చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి బీజేపీపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. కేంద్ర హౌం మంత్రి అమిత్ షా బుధవారం చేసిన ‘క్విట్ ఇండియా అని స్పష్టంచేశారు. కాషాయీకరణ, పోలరైజేషన్, మతతత్వం భారత దేశం నుంచి వెళ్లిపోవాలన్నారు. అవిశ్వాస తీర్మానం చాలా శక్తిమంతమైనదని, ప్రధాన మంత్రిని పార్లమెంట్‌కు తీసుకొచ్చింది వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని తాము అనుకోలేదన్నారు. ప్రధాని మోడీ పార్లమెంట్‌కు రావాలని, మణిపూర్ సమస్యపై మాట్లాడాలని మాత్రమే తాము డిమాండ్ చేశామన్నారు. ధృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి ఆయన పాలనలో నిండు సభలో ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగిందని, నేడు కూడా రాజు గుడ్డివాడిగా కూర్చున్నారని, మణిపూర్, హస్తినాపూర్ మధ్య తేడా ఏమీ లేదని మోడీని దుయ్యబట్టారు. దీంతో అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ప్రధాన మంత్రి మోడీపై నిరాధార ఆరోపణలు ఆమోదయోగ్యం కాదన్నారు. అధిర్ రంజన్ క్షమాపణ చెప్పాలని, ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, మోడీని ఉద్దేశించి అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించినట్టు తెలిపారు. అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ, మణిపూర్ సమస్య కేవలం ఓ రాష్ట్రానికి పరిమితం కాదని, ఇది ఇప్పటికే అంతర్జాతీయ కోణాన్ని సంతరించుకుందని చెప్పారు. అందుకే ప్రధాన మంత్రి జోక్యం తప్పనిసరి అని అన్నారు.
ప్రజలకు చేరువైన అభివృద్ధి ఫలాలు నిర్మల సీతారామన్
అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 1ః14 గంటల పాటు మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. తొమ్మిదేళ్ల మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ‘వస్తాయి, అందుతాయి’ అని ప్రజలు ఎదురు చూసేవారని, ప్రస్తుతం ‘వచ్చాయి. అందాయి’ అని ప్రజలు అంటున్నారని తెలిపారు.
ఆత్మస్తుతి…పరనింద : ప్రధాని సుధీర్ఘ ప్రసంగం
అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సమాధానం ఆత్మస్తుతి, పరనిందతో సాగింది. అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని ప్రతిపక్షాలకు తెలియనిదేమీ కాదు. అయితే మణిపూర్‌లో జరుగుతున్న అకృత్యాలపై నెలల తరబడి మౌనం వహించిన ప్రధాని, చివరికి విధిలేక తప్పనిసరి పరిస్థితులలో తీర్మానంపై చర్చకు సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. ఇది మోడీపై ప్రతిపక్షాలు సాధించిన నైతిక విజయమేనని చెప్పాలి. ప్రధాని పెదవి విప్పేలా చేసేందుకే తాము అవిశ్వాసాన్ని ప్రతిపాదించామని ఇండియా కూటమి మొదటి నుండీ చెబుతూనే ఉంది. ఆ విషయంలో ప్రతిపక్షాలు సఫలీకృతమయ్యాయి. అవిశ్వాసం ఎందుకు పెట్టారో ప్రతిపక్షాలకే స్పష్టత లేదని మోడీ సెలవిచ్చారు. మోడీతో మాట్లాడించేందుకే అవిశ్వాసం పెట్టామని ప్రతిపక్షాలు చెబుతూనే ఉన్నాయి కదా. ఇంకా ఇందులో ఏం స్పష్టత కావాలి? చట్టసభ ప్రజల సొమ్ముతో నడుస్తోందని, సభా సమయాన్ని దుర్వినియోగం చేయకూడదని కూడా ఆయన సుద్దులు చెప్పారు. ఆ పని చేస్తున్నది ప్రభుత్వమే కదా. మణిపూర్‌పై ప్రధాని ముందే ప్రకటన చేసి ఉంటే ఈ రాద్ధాంతం జరిగి ఉండేదే కాదు. దేశ అభివృద్ధి, సమగ్రత కోసం అర్థవంతమైన చర్చ జరగాలని ప్రధాని చెప్పారు. కానీ చర్చకు అధికార పక్షం ఎక్కడ అవకాశం ఇచ్చింది? సభలో జరుగుతున్న గందరగోళాన్ని సాకుగా చూపి వాయిదాలు వేయడానికే సభాపతులు పరిమితమయ్యారు తప్పించి సామరస్యపూర్వక వాతావరణాన్ని కల్పించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మోడీ చెప్పుకొచ్చారు. కళ్లు తెరిచి చూస్తే అభివృద్ధి కన్పిస్తుందని కూడా అన్నారు. కానీ జాతులు, కులాల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రాలు అట్టుడు కుతున్న విషయం ప్రధానికి తెలియదా? అభివృద్ధిలో ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాలు వెనుకబడే ఉన్నాయని ఆయన గ్రహించడం లేదా? పైగా ఎప్పుడో తొమ్మిది సంవత్సరాల క్రితం వరకూ దేశాన్ని పాలించిన యూపీఏ ప్రభుత్వంపై నిందలు వేయడం ఏమిటి? మోడీ తన ప్రసంగం యావత్తూ ప్రతిపక్షాలను దుమ్మెత్తి పోయడానికే పరిమితం చేశారు తప్పించి అసలు మణిపూర్ హింసపై మాట్లాడింది చాలా తక్కువ. ఆ రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు గంటల పాటు వివరించారంటూ ముక్తసరిగా చెప్పి, దాటవేశారు. మొత్తంగా చూస్తే మోడీ ప్రసంగం చప్పగా సాగింది. ప్రతిపక్షాలను నిందించడం తప్పించి తమ ప్రభుత్వం ఏం చేసిందో వివరించడంలో విఫలమయ్యారు. అవిశ్వాసం వీగిపోయినా నైతిక విజయం మాత్రం ఇండియా కూటమిదేననడంలో సందేహం లేదు.