వైసీపీ ప్రభుత్వ దురాగతాలను ప్రజల్లో ఎండగడతాం

– బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షులు డాక్టర్‌ తోట చంద్రశేఖర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఏపీలో వైసీపీ ప్రభుత్వ దురాగతాలను ప్రజల్లో ఎండగతామని భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు డాక్టర్‌ తోట చంద్రశేఖర్‌ విమర్శించారు. సోమవారం హైదారాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ ఏపీక్యాంప్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. వైసీపీ సర్కార్‌ పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయని దుయ్యబట్టారు. ఎన్నికల మ్యాని ఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజానీకాన్ని మోస గిస్తున్నదని విమర్శించారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో చేపట్టిన కార్యక్యమంలో ప్రజల నుండి ప్రజాప్రతినిధులకు ఎదురౌతున్న చీత్కారాలే వైసీపీ పాలనకు నిదర్శనమన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిం చిన టీడీపీ ప్రభుత్వానికి పట్టిన గతే జగన్‌ ప్రభుత్వానికి పడుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్‌ నాయకత్వాన్ని ఏపీ ప్రజలు ఆహ్వానిస్తున్నారని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు తలారి సురేష్‌ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాకు చెందిన యూత్‌ కాంగ్రెస్‌ కార్యదర్శి పి.సత్యనారాయణ తోట సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు . ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు గిద్దా శ్రీనివాస్‌నాయుడు పాల్గొన్నారు.