వక్ఫ్‌ బోర్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం

For the Waqf Board issue Let's find a permanent solution– మల్లారెడ్డి ఓటమి భయంతోనే జేఏసీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ సమావేశం
– ఆరు గ్యారెంటీలు పక్కా అమలు చేస్తాం
– బీఆర్‌ఎస్‌ ఏ ఒక్క హామీ అమలు చేయలేదు
– మన భవిష్యత్‌ ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యం : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్‌/కొడంగల్‌
నాలుగేండ్ల నుంచి బోడుప్పల్‌ కార్పోరేషన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న వక్ఫ్‌ సమస్యకు పరిష్కారం చూపడంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి విఫలమయ్యారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వత పరిష్కారం చూపుతామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను పక్కా అమలు చేస్తామని, టీఆర్‌ఎస్‌ల మడతతిప్పబోమని స్పష్టంచేశారు. బోడుప్పల్‌ కార్పోరేషన్‌లో వక్ఫ్‌ సమస్యపై జేఏసీ ప్రతినిధులు.. కాంగ్రెస్‌ మేడ్చల్‌ అభ్యర్థి తోటకూర వజ్రేష్‌ యాదవ్‌తో కలిసి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో సోమవారం కలిశారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నాలుగేండ్ల నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఏనాడూ సమస్యపై స్పందించని మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డి.. ఎన్నికలున్నాయి కాబట్టే హడావుడిగా జేఏసీ ప్రతినిధులను పిలిపించుకొని సమావేశం ఏర్పాటు చేసి, వక్ఫ్‌ సమస్యపై మభ్యపెట్టే పనికి సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్‌ బోర్డు భూ సమస్యకు పరిష్కారం చూపాలంటూ గతంలో ఆమరణ దీక్షకు దిగితే స్పందించని మల్లారెడ్డి నేడు ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఈ చర్చలు జరిపారన్నారు. బీఆర్‌ఎస్‌ బూటకపు మాటలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వక్ఫ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. రేవంత్‌ రెడ్డిని కలిసిన వారిలో కాంగ్రెస్‌ బోడుప్పల్‌ అధ్యక్షులు, కార్పోరేటర్‌ పోగుల నరసింహా రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కొత్త కిషోర్‌ గౌడ్‌, వక్ఫ్‌ బోర్డు భూముల బాధితుల జేఏసీ చైర్మెన్‌ శ్రీధర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఆరు గ్యాంరెంటీలు పక్కా అమలు చేస్తాం
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని చెప్పారు. సోమవారం వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదన్నారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికొక ఉద్యోగం ఇస్తానని మోసం చేసిందన్నారు. ఈ ప్రాంతానికి కృష్ణా జలాలతోపాటు కొడంగల్‌ మండలంలో సిమెంట్‌ ఫ్యాక్టరీ, రైల్వే లైన్‌ తీసుకువస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని తెలిపారు. నారాయణపేట, కొడంగల్‌ ఎత్తిపోతల ప్రాజెక్టు తీసుకువస్తే కేసీఆర్‌ దాన్ని మట్టిలో కలిపారన్నారు. పదేండ్లుగా సీఎం కేసీఆర్‌ ఈ ప్రాంతాన్ని వెనుకబాటుకు గురిచేశారన్నారు. సీఎం కేసీఆర్‌ రైతుబంధు ద్వారా రైతులకు పదివేల రూపాయలు ఇచ్చినా ఎరువుల ధరలు, విత్తన ధరలు పెరిగాయని, తాము అధికారంలోకి రాగానే రైతులకు రూ.15వేలు ఇస్తామన్నారు. కౌలు రైతులకు కూడా అమలుచేస్తామని చెప్పారు. గతంలో దౌల్తాబాద్‌ చెరువు కట్ట అలుగు పారితే ఆస్పత్రికి పోవాలన్న ఇబ్బందిగా ఉండేదని, బ్రిడ్జి నిర్మాణం చేసింది తనేనని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత కొడంగల్‌లో ఇసుక దందాలు పెరిగాయని ఆరోపించారు. కాంట్రాక్టర్లతో కమీషన్‌ తీసుకుంటున్నాడని, అమాయకులను పోలీస్‌స్టేషన్‌లో ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు మేలు జరగాలంటే చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు వెంకట్‌రావు, జిల్లా ఉపాధ్యక్షులు బోడి వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు వీరన్న, యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్‌, వెంకట్‌ రాములు, సత్యపాల్‌, తదితరులు పాల్గొన్నారు.