నవతెలంగాణ – అచ్చంపేట: నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న నక్కలగండి తండా, మర్లపాడు తండా, కేశ్య తండా, మన్నేవారి పల్లి గ్రామాల నిర్వాసితులకు రానున్న నెల రోజుల్లో ఆర్ అండర్ ఆర్ ద్వారా భూ సేకరణ చేసి ఇండ్లను నిర్మాణానికి అనుకూలమైన స్థలాన్ని ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణం చేపడతామని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ లు ప్రజలకు హామీ ఇచ్చారు. సోమవారం అచ్చంపేట మండల పరిధిలోని మర్లపాడు తండా గ్రామాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఎమ్మెల్యే వంశీకృష్ణ తో కలిసి జెసిబి పై ప్రయాణించి గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ముంపు గ్రామాల ప్రజల కోరిక మేరకు కల్వకుర్తి సమీపంలోని జెపి నగర్, తుకకుగూడ, దేవరకొండ వచింతపల్లి వద్ద ప్రభుత్వ భూమిని గుర్తిస్తే ఎమ్మెల్యే గారితో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అక్కడ అందరికీ కావలసినంత ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకుంటే అచ్చంపేట సమీపంలోని హాజీపూర్ వద్ద ఇదివరకే గురించిన స్థలంలో ఆర్ అండ్ ఆర్ ద్వారా పూర్తిస్థాయి నిర్మాణాలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ ముంపు గ్రామాల ప్రజలకు తెలిపారు. అదేవిధంగా మార్ల పాడు గ్రామ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో కృషి చేస్తుందన్నారు. గ్రామంలో రేషన్ కార్డులు లేని వాళ్లకు రేషన్ కార్డులను జారీకి తొందర్లోనే పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామన్నారు. రేషన్ ద్వారా అందించే సరుకులను గ్రామంలోని పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడే నివాసముంటు భూముల్లో సాగు చేస్తూ ప్రస్తుతం ముంపు ద్వారా నష్టం వాటిల్లిన పంటల వివరాలను సైతం రాష్ట్ర వ్యవనష్టపరిహాన్ని కార్యదర్శి కి నివేదించి అందుకు కావలసిన నష్టపరిహాన్ని గ్రామ ప్రజలకు అందేలా కృషి చేస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్ అండ్ ఆర్ క్రింద ఇండ్ల నిర్మాణంతోపాటు అన్ని వసతులతో కాలనీ ని నిర్మించి అందించేందుకు పూర్తిస్థాయిగా చర్యలు తీసుకుంటామని, కలెక్టర్ తెలిపారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ….. రానున్న ఒక మాసం రోజుల్లోనే అనువైన స్థలంలో ఆర్ అండ్ ఆర్ ద్వారా అన్ని వసతులతో కూడిన ఇండ్లను నిర్మించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లతో మాట్లాడి వెంటనే అమలు అయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే నిర్వాసిత గ్రామాల ప్రజలకు హామీ ఇచ్చారు. ముంపు గ్రామాల ప్రజలకు నచ్చిన గ్రామాల్లో స్థల సేకరణ కోసం ముంపు గ్రామాల ప్రజల కోరిక మేరకే ఐదు మందితో కమిటీ వేసి స్థల సేకరణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ముంపు గ్రామాల ప్రజలకు పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపినారు. హాజీపూర్ దగ్గర ఇదివరకే స్థలాన్ని సేకరించడం జరిగిందని, మీకు కావాల్సిన ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంటే ముఖ్యమంత్రితో మాట్లాడి అక్కడే ఇండ్ల నిర్మాణానికి అందుకు కావలసిన చర్యలను జిల్లా కలెక్టర్ తో కలిసి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వం పంపు గ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని ఆయన తెలిపారు. ఇప్పటి ప్రభుత్వం ముంపు గ్రామాల ప్రజలకు శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వంతో మాట్లాడి రానున్న ఒక నెలలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ యువకులకు లబ్ధిదారులుగా అవకాశం కల్పించేందుకు ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు నక్కల గండి ప్రాజెక్టు నీటిలో నాటు పడవలో ఎమ్మెల్యే కలెక్టర్ అధికారులు గ్రామ ప్రజలతో కలిసి నక్కల గండి ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మన్నె వారి పల్లి గ్రామ సమీపంలో దేవరకొండ చిన్నంపేట మన్నె వారి పల్లి గ్రామాల రహదారిపై ఉదృతంగా ప్రవహిస్తున్న దుందుభి నదిని కలెక్టర్ పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణానికి కావలసిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముంపు గ్రామాల ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా అందుకు స్పందించిన కలెక్టర్ త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చందాపూర్ వద్ద చంద్ర సాగర్ వాగు ప్రవాహాన్ని బ్రిడ్జి పైనుంచి ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఆర్డిఓ మాధవి, అచ్చంపేట డిఎస్పి శ్రీనివాస్, తహసిల్దార్ మురళీమోహన్, సీఐ రవీందర్, వివిధ శాఖల అధికారులు ముంపు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.