ఆర్టీసీకి నిధులిస్తాం

We will fund the RTC We will fund the RTC– ప్రతి నెల ‘మహాలక్ష్మి’ సొమ్ము చెల్లిస్తాం
–  చార్జీలు పెంచొద్దు
–  అంతర్గత సామర్థ్యం పెంచుకోండి: టీఎస్‌ఆర్టీసీపై సమీక్షలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
– టీఎస్‌ఆర్టీసీపై సమీక్షలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీకి క్రమం తప్పకుండా నిధులు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ‘మహాలక్ష్మి’ స్కీం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతున్నదనీ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాన్ని కొనసాగించాలని చెప్పారు. ‘మహాలక్ష్మి’ నిధుల్ని ఏనెలకు ఆ నెలలోనే ఇచ్చేస్తామనీ, సంస్థపై ఎలాంటి ఆర్థికభారం పడనీయబోమని స్పష్టం చేశారు. టిక్కెట్‌ చార్జీలు పెంచకుండా ఇతర ఆదాయ మార్గాలు అన్వేషించాలనీ, సంస్థ అంతర్గత సామర్థ్యాన్ని పెంచేదిశగా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. బుధవారంనాడిక్కడి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) స్థితిగతులపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌, డైరెక్టర్లు కూడా దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ఆర్థిక, సాంకేతిక అంశాలపై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. మహాలక్ష్మి స్కీం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 6.50 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని తెలిపారు. దీన్ని ఇలాగే ప్రశాంత వాతావరణంలో కొనసాగించాలని ఆర్థికమంత్రి చెప్పారు. తన శాఖ నుంచి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈపాటికే టీఎస్‌ఆర్టీసీకి నిర్వహణ వ్యయ నిధుల్ని సమకూర్చాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. సిబ్బందికి రావల్సిన బకాయిలు, సంస్థ అప్పులు, పీఎఫ్‌, సీసీఎస్‌, ఇతర సెటిల్‌మెంట్లకు నిధులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌లో మహాలక్ష్మి పథకం ద్వారా రోజుకు సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారనీ, దాదాపు రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్లను జారీ చేస్తున్నామని వివరించారు. ఆ సొమ్ముపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, రోజువారీ నిర్వహణకు అవసమైన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆలోచన చేస్తున్నామనీ, లాజిస్టిక్స్‌, కమర్షియల్‌, టిక్కేటేతర ఆదాయంపై దృష్టి పెట్టామన్నారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకష్ణారావు, రవాణా, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఉప ముఖ్యమంత్రి ఓఎస్డీ కష్ణభాస్కర్‌, టీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌లు మునిశేఖర్‌, కష్ణకాంత్‌, ఫైనాన్స్‌ అడ్వయిజర్‌ విజయ పుష్ప, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవనప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.