90 రోజుల్లో నివేదిక ఇస్తాం

We will give a report in 90 days‘కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల విషయమై 90 రోజుల్లో నివేదిక ఇస్తాం’ అని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తరఫున లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌ బృందం తెలిపింది. ఈ ప్యానెల్‌కి సెక్రటరీ, కన్వీనర్‌గా దామోదర ప్రసాద్‌, చైర్‌పర్సన్‌గా ఝాన్సీ ఉన్నారు. అలాగే ఇంటర్నల్‌ మెంబర్స్‌గా తమ్మారెడ్డి భరద్వాజ, సుచిత్రా చంద్రబోస్‌, వివేక్‌ కూచిభొట్ల, ప్రగతి, ఎక్స్‌టర్న్‌ల్‌ సభ్యులుగా రామలక్ష్మి మేడపాటి, కావ్యమండవ ఉన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ప్యానెల్‌ సభ్యులు మాట్లాడారు. ‘మహిళా కొరియోగ్రాఫర్‌ నుండి వచ్చిన ఫిర్యాదును స్వీకరించాం. అలాగే తెలుగు ఫిల్మ్‌ అండ్‌ టీవీ డ్యాన్సర్స్‌, డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌లో జానీ మాస్టర్‌ మీద వచ్చిన ఈ ఫిర్యాదును పరిష్కరించడానికి కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే తమ ప్యానెల్‌ 90 రోజుల్లో సమగ్రమైన నివేదిక అందజేస్తుంది. ఇకపై కూడా ఇలాంటి లైంగిక వేధింపుల ఫిర్యాదుల విషయంలో బాధితులు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ను సంప్రదించవచ్చు. ఛాంబర్‌ కార్యాలయంలో కంప్లైట్‌ బాక్స్‌తోపాటు ప్రత్యేక ఫోన్‌ నెంబర్‌(9849972280)ని, కంప్లైట్స్‌ఎట్‌దిరేట్‌ఆఫ్‌ఫిల్మ్‌ఛాంబర్‌ పేరుతో ఇ మెయిల్‌ని కూడా ఏర్పాటు చేశాం. అంతేకాదు బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతాం అని ప్యానెల్‌ బృందం తెలిపింది.