జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చి గృహాలను నిర్మించి ఇస్తాం

నవతెలంగాణ – సిద్దిపేట 
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణలోని జర్నలిస్టులకు స్థలాలు అందించి, గృహాలను కూడా నిర్మించి ఇస్తామని టిపిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్దిపేటలో జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా పలు పత్రికల్లో పనిచేస్తున్న విలేకరులను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టిపిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం సమయంలో అంకితభావంతో పనిచేసి, ఉద్యమాన్ని ప్రజలకు, కేంద్రానికి తెలియజేసిన  జర్నలిస్టుల పాత్ర ఎనలేనిదని అన్నారు. అలాంటి జర్నలిస్టులను సీఎం కేసీఆర్ పట్టించుకోకుండా నియంతగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కొన్ని పత్రికల్లో అనుకూలంగా రాసేవారికి పెద్దపీట వేస్తున్నారని చిన్న పత్రికలలో పనిచేస్తున్న వారిని పట్టించుకోవడం లేదని అన్నారు. తెలంగాణ ఏర్పాటు కాగానే జర్నలిస్టులను మరిచిపోయిన తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జర్నలిస్టులకు వారి సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో 6 తపేట శంకర్, గణేష్, గ్యాదర మదు, గ్యాసుద్దిన్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.