అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ పథకాల అమలులో ప్రాధాన్యత కల్పిస్తాం: కలెక్టర్

Eligible poor will be given priority in implementation of government schemes: Collectorనవతెలంగాణ – గాంధారి
అర్హులైన నిరు పేదలకు ప్రభుత్వ పథకాలు అమలులో ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం గాంధారి మండలంలోని మాధవపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల అమలు నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఈ నెల 26 నుండి అమలు పరచడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా అందించడం జరుగుతుందని తెలిపారు. భూములు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించడం జరుగుతుందని, ఉపాధి జాబ్ కార్డు కలిగి ఉండి, 2023-24 సంవత్సరంలో కనీసం 20 రోజులపాటు పనులు చేసి ఉండాలని తెలిపారు.  కొత్త రేషన్ కార్డుల కొరకు గత ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి, కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవడం కోసం, గతంలో దరఖాస్తు చేసుకోని వారు ప్రస్తుత గ్రామ సభల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ లలో దరఖాస్తులు సమర్పించవచ్చనీ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు కొరకు ఇండ్ల స్థలాలు ఉండి పక్క ఇళ్లు లేని నిరుపేదలు,  ఇళ్ల స్థలాలు ఉండి పక్క ఇళ్లు లేని వారికి గ్రామ సభ ఆమోదం మేరకు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి నాలుగు పథకాలలో అర్హులైన ముసాయిదా జాబితాలను గ్రామసభలో చదివి వినిపించడం జరుగుతుందని, వాటిపై ఏమైనా అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉన్నట్లయితే తెలియజేయాలని అన్నారు. పథకాలలో అర్హులైన వారికి అమలు పరచడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో త్రాగు నీటి సమస్య ఉందని, నీటి ట్యాంకు ఉన్నప్పటికీ గ్రామంలోని పైప్ లైన్ సరిగా లేవని తెలిపారు. స్వయం సహాయక బృందానికి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి భవనం మంజూరు చేయాలని కలెక్టర్ ను కోరారు. గ్రామంలోని నిరుపేదలు అర్హత కలిగిన వృద్దులకు ఫించన్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ రెడ్డి, ఎంపీడీఓ రాజేశ్వర్, వ్యవసాయ సహాయ సంచాలకురాలు లక్ష్మీ ప్రసన్న, వ్యవసాయ విస్తరణ అధికారి సూర్య ప్రకాష్, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.