– పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తాం
– మతపర రిజర్వేషన్లు ఎత్తేస్తాం..ఎస్సీ,ఎస్టీ, బీసీలకు పంచుతాం
– ఉజ్వల పథకం కింద ఏటా నాలుగు ఉచిత సిలిండర్లు
– కేసీఆర్ అవినీతిపై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ
– ఆగస్టు 27ని రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ దినంగా పాటిస్తాం
– కేసీఆర్ లోక్‌తంత్రను వదిలి లూటీతంత్రంలో పడ్డాడు
– ఓడియేపోయేవాళ్లు ఒప్పుకోరు..గెలుస్తామనే చెబుతారు
– బీజేపీ మ్యానిఫెస్టో ఆవిష్కరణలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే వరి ధాన్యం క్వింటాకు రూ.3,100 మద్దతు ధర ఇస్తామనీ, రైతులకు విత్తనాలు కొనుగోలు చేసేందుకు రూ.2500 ఇన్‌ఫుట్ అసిస్టెన్స్ అందజేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాదిరిగానే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను ఎత్తేస్తామని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని హోటల్ కత్రియాలో బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో-2023ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జులు ప్రకాశ్ జవదేకర్, తరుణ్‌చుగ్, కేంద్ర అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాం, నేతలు ప్రకాశ్‌రెడ్డి, సుభాష్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. చేసేదే చెప్పటం, చెప్పిందే చేయటం బీజేపీ నైజం అన్నారు. తమను గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి పనిచేస్తామని చెప్పారు. బీజేపీ మ్యానిఫెస్టో అంశాలు ప్రధాని మోడీ ఇస్తున్న హామీలు అన్నారు. ఓడిపోయే వాళ్ళు ఓడిపోతామని ఒప్పుకోరు కదా.. అందుకే మేమే గెలుస్తామని చెప్పుకుంటున్నారు అని కేసీఆర్ ప్రభుత్వానుద్దేశించి వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలను చుక్క రక్తపాతం లేకుండా నాటి వాజ్‌పేయి ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కానీ, తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ ఎంతో మంది యువకులను బలితీసుకున్నదని విమర్శించారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల కోట్ల నిధులను ఇస్తే..బీజేపీ తొమ్మిదున్నరేండ్లలో ఒక్క తెలంగాణకే రూ.2.5 లక్షల కోట్లను కేటాయించిందని వివరించారు. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ, పసుపుబోర్డు, ఎయిమ్స్, తదితరాలను ఇచ్చామనీ, నేషనల్‌హైవేలు, గ్రీన్‌ఫీల్డ్ హైవే వేశామని చెప్పారు. హైదరాబాద్ మెట్రోకు రూ.1200 కోట్ల కంటే ఎక్కువ నిధులు ఇచ్చామనీ, అంతర్జాతీయ విమాశ్రయం వరకు దాన్ని విస్తరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఓవైసీకి భయపడి విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ నిర్వహించలేదన్నారు. కేసీఆర్ లోక్‌తంత్రాన్ని వదిలి..దోపిడీ తంత్రాన్ని నమ్ముకుని పనిచేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా ఆయన ముందుకెళ్తున్నారని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల హామీల్లో ఒక్కటీ నెరవేరలేదని విమర్శించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారన్నారు. తెలంగాణలో ప్రతి ప్రాజెక్టులోనూ కమీషన్లు ఇవ్వాల్సిందేనని ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌పీ పరీక్ష పేపర్లను లీక్ చేసి యువత భవిష్యత్తుతోని రాష్ట్ర సర్కారు ఆడుకున్నదని విమర్శించారు. కేజీ టూ పీజీ విద్య, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం ఇలా ఏ ఒక్కటీ ఆచరణలో చేసి చూపెట్టలేదన్నారు. లిక్కర్, గ్రానైట్, మిషన్ కాకతీయ.. ఇలా ప్రతి పథకంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తాంత్రికులు చెప్పారని.. కేసీఆర్ పార్టీ పేరు మార్చారన్నారు. గ్యాస్ సిలిండర్ల తగ్గింపు అంశంపై రాష్ట్ర, కేంద్ర సర్కార్ రెండు కలిసి తగ్గిస్తే.. పేదలపై భారం పడదనీ, కేసీఆర్ ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. బీసీ సీఎం నినాదం నచ్చకనే రాజగోపాల్‌రెడ్డి, విజయశాంతి, వివేక్ పార్టీని వీడారని విమర్శించారు. వాళ్ల కోసం తమ పార్టీ విధానాలను మార్చుకోబోమన్నారు. కేసీఆర్ తమ పార్టీలో కోవర్టులు ఉన్నారంటున్నారనీ, మరి కేసీఆర్ కూడా టీడీపీ వ్యక్తే కదా అని అన్నారు. డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
క్వింటా వరికి రూ.3,100 ఇస్తాం
– హైదరాబాద్ విమోచన దినోత్సవంగా సెప్టెంబర్ 17ని అధికారికంగా ప్రకటిస్తాం.
– బైరాన్‌పల్లి, పరకాలలో రజాకార్ల ఆకృత్యాల్లో మరణించిన వారిని స్మరించుకుంటూ ఆగస్టు 27న రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ దినంగా గుర్తిస్తాం.
– నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వారిని స్మరించుకుంటూ హైదరాబాద్‌లో స్మారక స్థూపం, మ్యూజియం ఏర్పాటు చేస్తాం.
– అవినీతిరహిత పాలన అందిస్తాం. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ కమిటీ వేస్తాం.
– బీసీని సీఎంగా చేస్తాం.
– ఎస్సీ వర్గీకరణను వేగం చేసేందుకు సహకరిస్తాం.
– మతపర రిజర్వేషన్లను తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వాటిని వర్తింపజేస్తాం.
– ద్రవ్యోల్బణం తగ్గిస్తాం. సామాన్యులకు ఊరట కలిగించేలా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ ఎత్తేస్తాం.
– ఇప్పుడిస్తున్న ఎరువుల సబ్సిడీ(రూ.18వేలు)తో విత్తనాలు కొనుగోలు చేసేందుకు రూ.2,500 ఇన్‌ఫుట్ అసిస్టెన్స్ అందిస్తాం.
– పసుపు బోర్డు ఏర్పాటు నేపథ్యంలో ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేసి ఉపాధి కల్పనకు బాటలు వేస్తాం.
– వరికి మద్దత ధర క్వింటాకు రూ.3,100 ఇస్తాం. తెలంగాణలో ఉత్పత్తయ్యే బియ్యాన్ని కొనుగోలు చేస్తాం.
– ప్రధానమం త్రి ఫసల్ బీమా యోజన ద్వా రా రైతులకు ఉచిత పం ట బీమా కల్పిస్తాం.
– ఉజ్వ ల లబ్దిదారులకు ఏడాదికి ఉచితంగా నాలుగు గ్యా స్ సిలిండర్లు
– నవజాత ఆడపిల్లలపై ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తాం. 21 ఏండ్లు వచ్చాక రూ.2 లక్షలు పొందొచ్చు.
– డిగ్రీ, ఉన్నత చదువులు చదివే విద్యార్థునులకు ఉచితంగా ల్యాప్‌ట్యాప్‌లు
– స్వయం సహాయక బృందాలకు రూపాయి వడ్డీకే రుణాలు
– యూసీఎస్‌సీ తరహాలోనే గ్రూపు-1, గ్రూపు-2 ఉద్యోగాలను టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఆరు నెలలకోసారి భర్తీ చేస్తాం.
– ఆసక్తి గల రైతులకు ఆరోగ్య కరమైన ఆవును ఉచితం గా అందిస్తాం.
– అర్హత గల కుటుంబాలకు ఏడాదికి రూ.10 లక్షల ఉచిత ఆరోగ్య కవరేజీ. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఏడాదికోసారి ఉచిత వైద్య పరీక్షలు.
– కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా న్యాయబద్ధంగా దక్కేలా రాష్ట్రం తరఫున ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపిస్తాం.
– ఉద్యోగస్తులు, పింఛనర్లకు ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు అందేలా చూస్తాం.
– ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తాం.
– గ్రామాల్లోని అర్హులైన పేదలకు ఇంటి పట్టాలను అందిస్తాం.
– వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ యాత్ర.
– తెలంగాణకు చెందిన ఎన్నారైలు, గల్ఫ్ నివాసితుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు.