ఇజ్రాయిల్‌కు బుద్ధి చెబుతాం

We will give wisdom to Israel– ఎప్పుడు అనేది సైన్యం నిర్ణయిస్తుంది :ఇరాన్‌
– అదే జరిగితే ఇజ్రాయిల్‌ను ఆపలేం: అమెరికా
టెహ్రాన్‌ : ఇజ్రాయిల్‌ ఇటీవల తమ దేశంపై జరిపిన దాడికి బుద్ధి చెప్పేందుకు ఇరాన్‌ సుప్రీం జాతీయ భద్రతా మండలి పథక రచన చేసింది. అయితే ఎదురు దాడి ఎప్పుడు చేపట్టేది మిలిటరీ ఉన్నతాధికారులు నిర్ణయిస్తారని ఇరాన్‌ రివల్యూషన్‌ గార్డు కార్ప్స్‌ (ఐఆర్‌జిసి) మాజీ కమాండర్‌ , రక్షణ, భద్రత వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సబ్యుడు ఇస్మాయిల్‌ కోశారి చెప్పారు. ప్రతి దాడి ఎలా ఉండాలి అనే దానికి సంబంధించిన అన్ని వివరాలు మిలిటరీ నాయకులకు ఇచ్చాం. ఈ దాడులు ఎప్పుడు చేపట్టాలనేది వారే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. ‘యూదు దురహంకార ఇజ్రాయిల్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలనే విషయంలో ఇరాన్‌ సుప్రీం జాతీయ భద్రతా మండలి ఏకాభిప్రాయంతో ఉంది. ఇజ్రాయిల్‌ తాజా దురాగతానికి జవాబివ్వడం మా చట్టబద్ధమైన హక్కు. మేము దీనిని తప్పక ఉపయోగించుకుంటాం’ అని కోశారి చెప్పారు. ఇరాకీ భూ భాగం నుంచి ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు గత శనివారం ఇరాన్‌లోని మిలిటరీ స్థావరాలపై జరిపిన దాడిలో నల్గురు ఇరాన్‌ సైనికులు చనిపోయారు. ఒక పౌరుడు కూడా గాయాలతో తరువాత చనిపోయాడు. హనియే ను ఏప్రిల్‌లో ఇజ్రాయిల్‌ దాడి చేసి చంపినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య దాడులు, ప్రతి దాడులు గొలుసుకట్టుగా జరుగుతున్నాయి.
ఇరాన్‌ మళ్లీ దాడి చేస్తే ఇజ్రాయిల్‌ను ఆపడం కష్టం : అమెరికా బెదిరింపు
ఇరాన్‌ గనుక మళ్లీ దాడి చేస్తే ఇజ్రాయిల్‌ను ఆపడం కష్టమని, ఇది యుద్ధ విస్తరణకు దారి తీస్తుందని అమెరికా బెదిరించింది. ఇరాన్‌ మరోసారి దాడికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ఇజ్రాయిల్‌ గూఢచారి వర్గాలు సూచించిన నేపథ్యంలో అమెరికా ఈ బెదిరింపులకు దిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలోపే ఇరాన్‌ దాడి చేయవచ్చని ఇజ్రాయిల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉటంకిస్తూ యాక్సియోస్‌ వార్తా సంస్థ తెలిపింది.