సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేస్తాం

Adilabadనవతెలంగాణ-ఆసిఫాబాద్‌
ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ సిబ్బందికి పెండింగ్‌ ఎరియర్స్‌ చెల్లించడంతోపాటు, ఇతర మున్సిపాలిటీలలో చెల్లిస్తున్నట్లు కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలని సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోకుంటే సమ్మెకు వెళ్తామని మున్సిపాలిటీ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు శ్రీకాంత్‌ హెచ్చరించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యుడు కృష్ణమాచారితో కలిసి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి, అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి రెండో తేదీన ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీగా అవతరించిదన్నారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులను అప్పటి నుండి కేటగిరీల విభజించాలన్నారు. కార్మికుల వేతనాలను నిర్ణయించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర మున్సిపాలిటీలో ఇస్తున్న వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ ఆవిర్భావం నుంచి ఉన్న పెండింగ్‌ ఏరియర్స్‌ చెల్లించాలన్నారు. 15 రోజుల్లో సమస్య పరిష్కారాల కోసం చర్యలు తీసుకోవాలని లేదంటే ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మాట్ల రాజు, కార్యదర్శి తోట సమ్మయ్య, కోశాధికారి ఇగురపు బాపురావ్‌, నాయకులు లక్ష్మీ, పద్మ, సిడం మోతిరాం, ఇస్తారి, సాగర్‌, శ్రీనివాస్‌, బాలేశ్‌ పాల్గొన్నారు.