– మా కార్యకర్తలే చెట్టుకు వేలాడగడ్తారు
– ఒక కుటుంబం చెరనుంచి తెలంగాణను విముక్తి చేశాం
– రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరి భాగస్వామ్యం అవసరం
– 60 ఏండ్లలో రూ.72 వేల కోట్లు, ఈ పదేండ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పు
– 26 తర్వాత ఇంద్రవెల్లి నుంచి రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన
– ఆర్థిక సంక్షోభం నుంచి అభివృద్ధి పథంవైపు తెలంగాణ
– పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నిషాన్ లేకుండా పాతిపెడతా : లండన్ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘పులి అంట ఇంట్ల పండుకున్నదంట. లేచి వచ్చిందంట. నేను కూడా దానికోసమే చూస్తున్న బిడ్డా. మా దగ్గర బోనుంది. మా దగ్గర వల ఉంది. రమ్మను చెట్టుకు వేలాడగడ్తారు. ఆ బాధ్యత మా కార్యకర్తలు తీసుకుంటరు. ఆ మాటలేంది? ఆ అహంకారమేందీ? ఆ బలుపేంది? అధికార మదం దిగినట్టు లేదు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆ బలుపును దించే పని మా కార్యకర్తలు తీసుకుంటరు. ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దొరల పాలన వద్దు. ప్రజా పాలన కావాలంటూ ప్రజలు ఆశీర్వదించారు. అందరి ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం.’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విదేశీ పర్యటనలో భాగంగా శనివారం ఆయన లండన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాక సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన భారతీయులందరికీ ధన్యవాదాలు చెప్పారు. మిత్రుడు వేణుగోపాల్, సుధాకర్, వారి బృందం అందరూ కలిసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఆనందంగా ఉందన్నారు.
36 నెలల్లో థేమ్స్ తరహాలో మూసీ నది అభివృద్ధి
థేమ్స్ నది చూశాననీ, ఒకప్పుడు అక్కడ కలుషితమైన వాతావరణముండేదని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల సహకారంతో దాన్ని అభివృద్ది చేసి పర్యాటక కేంద్రంగా, వ్యాపార కేంద్రంగా మారిందని గుర్తు చేశారు. తెలంగాణలో మూసీ నది కాలుష్యంతో మురికి కూపంగా మారిందన్నారు. థేమ్స్‌తో పోటీ పడేలా మూసీ ప్రాజెక్టును అభివృద్ది చేయాలనీ, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా నడిపించాలని అన్నారు. 55 కిలోమీటర్ల మూసీ నదిని పూర్తిగా పునరుజ్జీవంగావించి ప్రజల ముందుంచాలనే గొప్ప లక్ష్యంతో ఈ పర్యటనకు వచ్చానని చెప్పారు. రాబోయే 36 నెలల్లో థేమ్స్ నదీ తరహాలో మూసీ నదిని అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రప్రంచంలోని పర్యాటకులందరూ మూసి నది అందాలను తిలకించడానికి హైదరాబాద్‌ను సందర్శించేలా చేస్తామన్నారు. గోల్కొండ, చార్మినార్, కులీకుతూబ్ షాహి టూంబ్స్‌ను చూడాలని కోరారు. నెక్లేస్‌రోడ్ మీద ఫోటోలు దిగాలనీ, మన చారిత్రక వారసత్వ సంపదను ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యత తమ ప్రభుత్వం మీద ఉందని వివరించారు. అందుకు ప్రజలే బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో విసిరేశారు
రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో తండాలు, గూడాలు, మారుమూల పల్లెలు, పట్ట ణాలు, నగరాల నుంచి ఇతర దేశాలలో ఉన్న అభి మానులు, మిత్రులు, కార్యకర్తలు, వాళ్ల బంధువులు, కుటుంబ సభ్యులు, సానుభూతి పరులందరినీ సమన్వయం చేశామని రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఒక కుటుంబం చెరనుంచి తెలంగాణను విముక్తం చేశామన్నారు. తెలంగాణ తల్లికి విముక్తి కల్పించేందుకు అందరూ కృషి చేశారని చెప్పారు. అందుకే ఒక దశాబ్ద కాలం పీడ కలగా మారిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) పాలనను బంగాళఖాతంలో విసిరేశారని అన్నారు.
రూ.40 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం
20 ఏండ్లు ప్రతిపక్షంలో, ప్రజల్లో ఉంటూ సమస్యలమీద పోరాటం చేస్తూ నిత్యం వాటి పరిష్కారం కోసం అందరి మధ్యలో ఉన్నానని రేవంత్‌రెడ్డి చెప్పారు. అందుకే ప్రజలు గుండెల్లో పెట్టుకుని, భుజాలమీద మోసి తెలంగాణ ముఖ్యమంత్రిగా తనకు అవకాశమిచ్చారని అన్నారు. పునర్నిర్మాణంలో అందరి భాగస్వామ్యం తప్పనిసరి అని చెప్పారు. సముచితమైన నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణకు పెట్టుబడులను తేవాలన్న లక్ష్యంతో అధికారుల బృందంతో దావోస్‌కు వెళ్లానని వివరించారు. 48 గంటల్లో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద అంతర్జాతీయ సంస్థలకు, పెట్టుబడిదారులకు ఒక నమ్మకం, విశ్వాసం కలిగించామని చెప్పారు. పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణను నిలబెట్టామని అన్నారు.
ప్రపంచంలోనే హైదరాబాద్ ప్రసిద్ధి
ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం ప్రసిద్ది గాంచిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ అభివృద్దిలో ఇందిరాగాంధీ కృషి ఎంతో ఉందన్నారు. హైదరాబాద్ సరిహద్దుల్లో బీహెచ్‌ఈల్, బీడీఎల్, డైనమిక్ లిమిటెడ్, ఐడీపీఎల్ ఇలా ఎన్నో సంస్థలను ఆమె నెలకొల్పారని గుర్తు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌కు అప్పుడే గుర్తింపు వచ్చిందన్నారు. దేశానికి కంప్యూటర్లు పరిచయం చేసింది అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ అని అన్నారు. సంక్షేమానికి నందమూరి తారకరామారావు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆరాధ్యులని వారి సేవలను కొనియాడారు. ఐటీ, అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రంగం చూసినా ఆనాటి నాయకులు చేసిన అభివృద్దికి, దానికి సహకరించిన విధానాలను కొనసాగించాలనే ఆలోచనతో అడుగులేస్తున్నామని వివరించారు. మంచి ఎవరు చేసినా ఆ పనులకు ఎవరు పునాది రాయి వేసినా వాటిని పాటించడానికి, కొనసాగించడానికి తమ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి భేషజాల్లేవన్నారు.
ఆర్థిక సంక్షోభం నుంచి అభివృద్ధి పథంవైపు తెలంగాణ
కొంతమంది కుటుంబం కోసం రాష్ట్రాన్ని ఫణంగా పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఇప్పుడు అభివృద్ది గురించి చర్చలే జరగొద్దంటున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించొద్దంటూ మాట్లాడుతున్నారని చెప్పారు. 60 ఏండ్లలో 16 మంది ముఖ్యమంత్రులు తెచ్చిన అప్పు రూ.72 వేల కోట్లయితే, ఒకే ఒక్క కుటుంబం ఈ పదేండ్లలోనే రూ.ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందని వివరించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలో ముంచిందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. ప్రతి నెల మొదటి వారం ఐదో తేదీలోపు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే, 25 వరకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని అన్నారు. తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతే తాను సీఎం అయ్యాక ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి నెలలోనే ఐదో తేదీలోపు జీతాలు చెల్లించామన్నారు. ఈ ఆర్థిక సంక్షోభం నుండి తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపిస్తామని చెప్పారు.
వందరోజుల్లో ఆరు గ్యారంటీల అమలు
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గతనెల తొమ్మిదిన అసెంబ్లీ మొదలు పెట్టిన మొదటి రోజే గ్యారంటీలు ఎప్పడు అమలు చేస్తారంటూ బిల్లా రంగాలు (కేటీఆర్, హరీశ్‌రావు) మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఆ పార్టీనీ ఆ నాయకులను బొక్కబోర్ల పడేసి బొక్కలు ఇరగ్గొట్టినా బుద్ధి రాలేదన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో చూసుకుందామని బీఆర్‌ఎస్ నేతలకు ఆయన సవాలు విసిరారు. 26వ తేదీ తర్వాత ఇంద్రవెల్లిలో మొదలు పెట్టి రాష్ట్రం నలుమూలలా సుడిగాలి పర్యటన చేస్తానని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నిషాన్ లేకుండా వంద మీటర్ల గోతి తీసి పాతిపెడతానని అన్నారు.
సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చా…
ఎన్నికలప్పుడే రాజకీయం, మిగతా సమయంలో పరిపాలనా, రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా పనిచేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. అభివృద్ది, సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపాలంచాలన్న ఆలోచనతో అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. తాను సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చినవాణ్నేనని అన్నారు. నల్లమల అడవిలోంచి రైతు బిడ్డగా అతి సామాన్యమైన కుటుంబం నుంచి కార్యకర్తగా మొదలై ఇన్నేండ్లలో ముఖ్యమంత్రి హోదాకు చేరుకున్నానని వివరించారు. తాను ఆషామాషీగా సీఎం కాలేదన్నారు. అయ్యో, బాబో ఇస్తే ఇది రాలేదనీ, అయ్య పేరు చెప్పుకుని మంత్రి అయి విలాసవంతమైన జీవితాన్ని గడిపేటందుకు రాలేదని కేటీఆర్‌నుద్దేశించి ఎద్దేవా చేశారు.
ప్రపంచంతోనే పోటీ
కర్ణాటకో, తమిళనాడో, ఆంధ్రప్రదేశో, ఒడిశాతోనో పోటీ పడాలని రాలేదనీ, అది తన లక్ష్యం కాదని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ప్రపంచంతోనే పోటి పడాలనే ఆలోచనతో ఉన్నానని చెప్పారు. ప్రపంచంతోనే పోటీ పడే ఐటీ హబ్ హైదరాబాద్‌కు ఉందనీ, లక్షలాది మంది ఐటీ నిపుణులున్నారని వివరించారు. ప్రపంచానికే వ్యాక్సిన్లను ఎగుమతి చేసి వాటిని కనిపెట్టిన సంస్థలు తెలంగాణ గడ్డ మీద ఉన్నాయని చెప్పారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేశారని అన్నారు. అందరి బాధలు విన్నారని చెప్పారు. కర్ణాటక, తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రాహుల్‌గాంధీ నేతృత్వంలో అందరి సహకారంతో లాల్ ఖిలాపై కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నామని అన్నారు.