హామీలన్నీ అమలుచేస్తాం

– మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్‌, మంత్రి శ్రీధర్‌ బాబు
–  వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్‌ :మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని టీపీసీసీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్‌, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శ్రీధర్‌ బాబు అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ది మంచి మ్యానిఫెస్టో అని ప్రజలు ఆదరించారని తెలిపారు. అధికారంలోకి రాగానే ఆ మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు దిశగా అడుగులు వేశామని చెప్పారు. రెండో రోజే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ కవరేజి రూ.10 లక్షలకు పెంపు అమల్లోకి తెచ్చామని గుర్తుచేశారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ చేస్తున్న విమర్శలు తొందరపాటుతనంతో కూడుకున్నవని విమర్శించారు.
వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ హమీ నెరవేరబోతుందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వంద రోజుల్లో హామీలను అమలు చేసి తీరుతామని చెప్పారు. కేసీఆర్‌ నిర్వాకంతో రాష్ట్రం గుల్ల కావడంతో హామీల అమల్లో కాస్త జాప్యం జరుగుతున్నదన్నారు. నిరుద్యోగ భృతి మొదలు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల వరకు హామీలను బీఆర్‌ఎస్‌ విస్మరించిందని విమర్శించారు. అలాంటి బీఆర్‌ఎస్‌ ప్రజలను రెచ్చగొడుతున్నదనీ, అదే పని గతంలో కాంగ్రెస్‌ చేసి ఉంటే కేసీఆర్‌ ఫాం హౌజ్‌ దాటకపోయే వారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదనీ, మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని హెచ్చరించారు. కాళేశ్వరంతో పాటు అన్ని అక్రమా లపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో సహకారం తీసుకుంటాం : ఏఐసీసీ ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ చైర్మెన్‌ ప్రవీణ్‌ చక్రవర్తి
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మంచి మ్యానిఫెస్టోను అందించడంతో దాన్ని రాష్ట్ర ప్రజలు విశ్వసించారని ఏఐసీసీ ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ చైర్మెన్‌ ప్రవీణ్‌ చక్రవర్తి తెలిపారు. మ్యానిఫెస్టో అంటే ప్రజలకు దగ్గరగా, అమలుకు నోచుకునే విధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. పబ్లిక్‌ ఫ్రెండ్లీగా, క్రోనీ క్యాపిటల్‌కు దూరంగా ప్రజావసరాలకు దగ్గరగా ఉండాలని చెప్పారు. ఏఐసీసీ మ్యానిఫెస్టో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో రూపొందుతున్నదని తెలిపారు. దీని కోసం తెలంగాణ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ సహకారం తీసుకుంటామని చెప్పారు. ప్రతి రాష్ట్రం వెళ్లి ప్రజలు, నిపుణుల నుంచి సూచనలు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్యంలో మ్యానిఫెస్టో ఒక ముఖ్యమైన సాధనమని చెప్పారు. పౌర సమాజ నిపుణులు, సామాన్య ప్రజలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ సమావేశంలో పలు విషయాలపై చర్చించినట్టు తెలిపారు. ఈ చర్చల నుంచి ఒకట్రెండు సూచనలు ఏఐసీసీ మ్యానిఫెస్టోలో వెళతాయని చెప్పారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జి దీపదాస్‌ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌ చౌదరీ, మన్సూర్‌ అలీ ఖాన్‌, ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మ్యానిఫెస్టో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.