– ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
నవ తెలంగాణ – సిద్దిపేట
రాష్ట్రంలో వ్యవసాయాన్ని, ఉపాధి రంగాన్ని, పరిశ్రమలు, ఐటీని అగ్రగామిగా నిలపడానికి కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తామని, దేశంలో తెలంగాణను ఆదర్శంగా నిలుపుతామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ఆయన తన నియోజకవర్గానికి వెళ్తున్న క్రమంలో జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు ఆయనను కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛను కల్పించాలనేది సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో కక్ష సాధింపులు ఉండవని తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు మేలుగా ఉన్నాయనుకుంటే వాటిని కొనసాగిస్తామన్నారు. ఎన్నికల సమయంలో తాము చెప్పిన 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆటో కార్మికులకు తమ ప్రభుత్వం సంపూర్ణంగా అండగా ఉంటుందన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేసి.. జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. సిద్దిపేట, ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రులుగా దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ ఉన్నారని, వారి ఆధ్వర్యంలో సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.