పేదలను కోటీశ్వరులను చేస్తాం

– విజన్‌ 2035 దిశగా ముందుకు సాగాలి
– భవిష్యత్తు యువతరానిదే
– టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌
పేదలను కోటీశ్వరులను చేయడమే తెలుగుదేశం లక్ష్యమని ఆపార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ వ్యాఖ్యానించారు. ఇప్పుడు విజన్‌ 2020 కాదనీ, విజన్‌ 2035 దిశగా ముందుకు సాగాలని చెప్పారు. భవిష్యత్తు అంతా యువతరానిదేనని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో జహీరాబాద్‌ పార్లమెంట్‌, వరంగల్‌ తూర్పు, నిర్మల్‌ జిల్లాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ తెలుగుదేశం పుట్టిన నాటి నుంచి పేద బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కషి చేసిన పార్టీ టీడీపీ అని అన్నారు. నాడు ఎన్టీఆర్‌ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి, కోట్లాది మంది ప్రజల మన్నలను పొందారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విజన్‌ 2020 తో ఐటి హబ్‌ లు ఏర్పాటు చేసి లక్షల మంది విద్యార్థుల కు ఐటి రంగంలో ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు. నేటి యువతకు మద్యం కాదు, మంచి భవష్యత్తు ఇచ్చే ప్రభుత్వాలు రావాలన్నారు. అది తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కిలి ఐలయ్య, జహీరాబాద్‌ పార్లమెంట్‌, వరంగల్‌ తూర్పు, నిర్మల్‌ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.