డీజీపీ అఫిడవిట్‌లోని అంశాల అమలును పర్యవేక్షిస్తాం

– వట్టి జానయ్య కేసులో సుప్రీం వెల్లడి
– తదుపరి విచారణ మూడు నెలలకు వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మాజీ బీఆర్‌ఎస్‌ నేత వట్టి జానయ్యపై నమోదైన కేసులపై తెలంగాణ డీజీపీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో అంశాల అమలు తీరును తాము పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్ట చేసింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తనపై ఒకే సారి తెలంగాణ పోలీసులు పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ సూర్యాపేటకు చెందిన వట్టి జానయ్య గతేడాది సెప్టెంబర్‌ 20న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్‌, మధ్యంతర బెయిల్‌, ముందస్తు బెయిల్‌ కోరుతూ మొత్తం ఆరు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లు(ఎస్‌ఎల్పీ) దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం (గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌) తన పై ఒకేసారి అక్రమాస్తులు, నేరపూరిత బెదిరింపులు, దొంగతనం, దోపిడీ కేసులకు సంబంధించి పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసిందని ఇందులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్‌, ప్రభుత్వ న్యాయవాది మధ్య డిస్‌కనెక్ట్‌ కారణంగా… గత విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర డీజీపీ వర్చువల్‌ మోడ్‌ లో ధర్మాసనం ముందు హాజరయ్యారు. మరోసారి ఎలాంటి పొరపాట్లు జరగనీయబోమని, సంబంధిత అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈ వినతితో సంతప్తి చెందని కోర్టు… ఈ అసమానతలపై నాలుగు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా వట్టి జానయ్య కేసులకు సంబంధించి డీజీపీ అఫిడవిట్‌ దాఖలు చేశారు. మంగళవారం మరోసారి వట్టి జానయ్య పై దాఖలు చేసిన పిటిషన్లపై జరిపిన జస్టిస్‌ హషికేశ్‌ రారు, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టిల ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర పోలీసుల తరపు సీనియర్‌ అడ్వొకేట్‌ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జానయ్యపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు, తీసుకున్న చర్యలు, తదుపరి తీసుకోబోయే చర్యలపై సవివరంగా అఫిడవిట్‌లో పొందుపరిచినట్లు కోర్టుకు తెలిపారు. ఈ అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్నట్టు ధర్మాసనం తెలిపింది. అలాగే అఫిడవిట్‌ను పరిశీలించి, అందులో పేర్కొన్న అంశాల అమలు తీరును పర్యవేక్షిస్తామని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను మూడు నెలలకు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. కాగా వట్టి జానయ్య దాఖలైన కేసుల్లో ఇప్పటికే సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.