42 శాతం బీసీ రిజర్వేషన్‌ కోసం ఉద్యమిస్తాం

 Adilabad– బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డి.రాజారాం యాదవ్‌
– జిల్లా కేంద్రంలో బీసీల సత్యాగ్రహ దీక్ష
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగనైతే పోరాడమే అదే విధంగా బీసీ రిజర్వేషన్‌ కోసం ఉద్యమిస్తామని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు పోరాడుతామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డి.రాజారాం యాదవ్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం ఎదుట బీసీ జనసభ, బీసీ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యాగ్రహా దీక్షలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్‌ ప్రకటించిన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి రాకముందు కామారెడ్డి సభలో బీసీ రిజార్వేషన్‌ 42 శాతం ఇస్తామని ప్రకటించిందన్నారు. కానీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతున్న ఎలాంటి చర్యలు లేవన్నారు. రూ. లక్ష కోట్ల బడ్జెన్‌ను కేటాయిస్తామని చెప్పి విస్మరించారని ఆరోపించారు. ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వలేదన్నారు. కేవలం సీఎం తన సామాజిక వర్గానికే న్యాయం చేస్తూ బీసీలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఎలా అయితే ఏకతాటికిపై వచ్చి రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే తరాహా ఉద్యమాన్ని చేపట్టి బీసీ రిజార్వేషనుల సాధించుకుంటామన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి తన కులపొల్లకే పదవులు ఇస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి బీసీల ఓట్లు కావాలి..పదవులు మాత్రం వద్దా..? అని ప్రశ్నించారు. బీసీల ఓట్లు కొల్లగొట్టడం కోసమే సీఎం చూస్తున్నారన్నారు. బీసీలను చైతన్య పర్చాడానికి జిల్లాల వారీగా కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ దీక్షలో ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్‌ రవి కిరణ్‌ యాదవ్‌, బీసీ సంఘాల నాయకులు మేకల కృష్ణ, వేణుకుమార్‌, గజేందర్‌, కాశవేణి నారాయణ, హన్మండ్లు యాదవ్‌, ఈర్ల సత్యనారాయణ, అన్నదానం జగదీష్‌, రఘువీర్‌ యాదవ్‌, రవికాంత్‌, వేణు యాదవ్‌ పాల్గొన్నారు.