సెక్షన్‌ 104(1),(2) రద్దు కోసం ఉద్యమిస్తాం

సెక్షన్‌ 104(1),(2) రద్దు కోసం ఉద్యమిస్తాం– హిట్‌ అండ్‌ రన్‌ కేసులపై కేంద్రం వెనక్కి తగ్గాలి : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేశ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో డ్రైవర్లకు పదేండ్ల జైలుశిక్ష, రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా జరిమానా విధించటం నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేదాకా ఉద్యమిస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేశ్‌ చెప్పారు. భారత న్యాయ సంహితలోని హిట్‌ అండ్‌ రన్‌కు సబంధించి సెక్షన్‌ 104(1), (2) సెక్షన్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్టు ఫెడరేషన్‌(ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌-సీఐటీయూ) హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి చిక్కడపల్లి మెట్రో రైల్వే స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన అనంతరం వెంకటేశ్‌ మాట్లాడుతూ..ఉత్పత్తులు, నిత్యావసరాలు ఒక చోట నుంచి మరోచోటకు చేరవేయడంలో డ్రైవర్లు అందించే సేవలు కీలకమైనవన్నారు. అటువంటి డ్రైవర్లను ప్రమాదాలకు కారణమని నిందించడం సరిగాదన్నారు. రోడ్లు, సిగలింగ్‌ వ్యవస్థలు సరిచేయకుండా డ్రైవర్లను బాధ్యులుగా చిత్రీకరించడం దుర్మార్గమన్నారు. అనుకోకుండా జరిగే యాక్సిడెంట్లను డ్రైవర్లకు ఉద్దేశపూర్వకంగా ఆపాదించడం అన్యాయమన్నారు. డ్రైవర్ల జీవితాల్ని జైలు పాలు చేస్తే అది భారత న్యాయ సంహిత కాదనీ, భారత అన్యాయ సంహిత అవుతుందని విమర్శించారు. ప్రమాదాల విషయంలో డ్రైవర్లకు పదేండ్ల జైలు శిక్ష, రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల జరిమానా ప్రతిపాదనలను వెనక్కి తీసుకోకపోతే మోడీ బండిని ముందుకు కదలనివ్వబోమని హెచ్చరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏఐఆర్‌ఈడబ్ల్యుఎఫ్‌ నగర కార్యదర్శి కే అజరు బాబు మాట్లాడుతూ..ప్రమాదాలు జరిగిన సందర్భంలో చట్టం చెప్పినట్టు డ్రైవర్లు అక్కడే ఉండి పోలీసులకు వివరాలు తెలుపుతారనీ, కానీ, పోలీసులు వచ్చేదాకా డ్రైవర్లపై దాడులు జరగకుండా అమిత్‌ షా, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందా? అని ప్రశ్నించారు. సీఐటీయూ నగరాధ్యక్షులు జె.కుమారస్వామి మాట్లాడుతూ.. హిట్‌ అండ్‌ రన్‌ కేసులలో ఈ కొత్త ప్రతిపాదనల వలన డ్రైవర్ల సంపాదన ప్రభుత్వ ఖజానా పాలు, జీవితాలు జైలు పాలు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలకు పూర్తిగా డ్రైవర్లు కారణం కాదనీ, ఇతర పరిస్థితులే 90 శాతం అని వివిగిరి లేబర్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ సర్వే తేల్చిన విషయాన్ని ప్రస్తావించారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు ఎం.సత్యనారాయణ, సహాయ కార్యదర్శులు జి.రాములు, డిఎల్‌ మోహన్‌, ఎఐఆర్‌డబ్ల్యుఎఫ్‌ నగర ఉపాధ్యక్షులు ఎమ్‌డీ ఖలీమ్‌, షేక్‌ సాబేర, గౌస్‌ భాష, సహాయ కార్యదర్శులు బి ఉమేష్‌ రెడ్డి, ముఖేష్‌ శర్మ, వహీద్‌, మజీద్‌, కోటి, నగర నాయకులు మోయిన్‌, శ్రీనివాస్‌, అర్బజ్‌ ఖాన్‌, శ్రీశైలం, రెహమాన్‌, ఫారుక్‌ పాల్గొన్నారు.