ప్రభుత్వ యూనివర్సిటీల పరిరక్షణకై ఉద్యమిస్తాం..

– ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర యూనివర్సిటీ ల ఇంచార్జీ రెహమాన్, డిమాండ్..
నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీల పరిరక్షణకై ఉద్యమిస్తామని ఎఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల ఇంచార్జ్ రెహమాన్ అన్నారు.ఎఐఎస్ఎఫ్ 88వ ఆవిర్భావ దినోత్సవం శనివారం తెలంగాణ యూనివర్సిటీలో,డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో మండల ప్రధాన కార్యదర్శి దినేష్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఎగురవేసిన రెహమాన్, దినేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం పోరాటంలో విద్యార్థులను, యువకులను ఏకం చేసి బ్రిటిష్ వారిని తరిమిన చరిత్ర ఎఐఎస్ఎఫ్ దన్నారు. 1936, ఆగస్టు 12న ఏర్పడిన సంఘం విద్యారంగ సమస్యలపై అలుపెరుగని ఉద్యమాలు నిర్వహిస్తోందని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు నిర్లక్ష్యానికి గురౌతున్నాయని, యూనివర్సిటీల విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని రెహమాన్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, పెంచిన పీజీ, పీహెచ్డీ ఫీజులు తగ్గించాలని రెహమాన్ డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని, పూర్తి స్థాయిలో వీసీని నియమించాలని, విద్యార్థులకు హాస్టల్ సౌకర్యాలు మెరుగు పరచాలని రెహమాన్ కోరారు.ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం, తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జ్ తరుణ్, విష్ణు వర్ధన్, శేఖర్, అజయ్, రాజ్ కుమార్, యాదగిరి, అభిషేక్, ఖలీల్, సంతోష్, సతీష్ , ప్రభు,డిచ్ పల్లి నాయకులు నవీన్, నితిన్, రాహుల్, క్రాంతి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.